- అనర్హులకు ప్రజాధనం పంచి పెట్టలేం
- ప్రజాభిప్రాయం మేరకే పథకాల అమలు
- రైతు భరోసా నేటి నుంచి అభిప్రాయ సేకరణ
- రైతుల కోసం రెవెన్యూలో సంస్కరణలు
- అధికారుల బదిలీల్లో పైరవీలకు తావు లేదు
- మీడియాతో చిట్ చాట్‌లో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 9 (విజయక్రాంతి): రైతు రుణ మాఫీకి త్వరలోనే మార్గదర్శకాలు జారీచేస్తామని రెవెన్యూవాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15వ తేదీనాటికి అర్హులైన రైతులందరికి రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా అనర్హులకు ప్రజాధనాన్ని పంచిపెట్టబోమని స్పష్టంచేశారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో మీడి యా ప్రతినిధులతో మంత్రి చిట్‌చాట్ నిర్వహించారు. రైతు భరోసా పథకం విధి విధానాలపై అధ్యాయనానికి బుధవారం నుంచి రైతుల అభిప్రాయ సేకరణ చేపడుతున్నామ ని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. స్వయం గా వ్యవసాయం చేసే రైతులకే పంట పెట్టుబడి సాయం చేయాలని, గత ప్రభుత్వం పడావు భూములకు, లేఅవుట్లకు, నేషల్ హైవే అథారిటీ భూములకు కూడా రైతుబం ధు ఇవ్వడంతో రూ.500 కోట్ల పైచిలుకు అదనపు భారం పడిందని విమర్శించారు.
పైరవీలకు తావులేకుండా బదిలీలు
కేసీఆర్ ప్రభుత్వం కనీస అధ్యయనం చేయకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల నేడు రాష్ట్రంలో ధరణి రైతుల పాలిట శనిగా మారిందని పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గతంలో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తుల్లో చాలావరకు పరిష్కరించినప్పటికీ, మళ్లీ కొత్తగా వస్తున్న దరఖాస్తులతో 2.65 లక్షలకు పెండింగ్ పెరిగిందని తెలిపారు. కారణం లేకుండా రైతుల దరఖాస్తులను తిరస్కరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌వోఆర్ యాక్టులో సంస్కరణలు చేస్తున్నామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి
రాష్ట్రంలో వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దుతో న్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని మంత్రి తెలిపారు. ఇకపై ప్రతి రెవెన్యూ గ్రామానాకి ఒక రెవెన్యూ అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2011లో మాత్రమే అప్పటి ప్రభుత్వం భూముల ధరలను శాస్త్రీయంగా సవరించిందని, 2021, 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ధరలను పెంచడంతో మార్కెట్‌లో ఉన్న భూముల ధరలకు, ప్రభుత్వ విలువలకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. కొందరు అధికారులు ఫోకల్ పోస్టింగ్‌ల కోసం తనపై ఒత్తిడి తెప్పిస్తున్నారని, కానీ పైరవీలకు ఆస్కారం లేకుండా అధికారుల బదిలీలు చేపడుతామని ప్రకటించారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు త్వరలోనే మోక్షం ఉంటుందని చెప్పారు. జీవో 58 లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని, అందుకు సంబంధించిన విధి విధానాలపై మరింత లోతుగా అధ్యాయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. పార్టీ పిరాయింపుకు ప్రోత్సహించడం తమ విధానం కాదన్నారు.
కానీ కేసీఆర్ మెజార్టీ ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలుస్తామని, బహిరంగ ప్రకటనలు చేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ నుంచి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని, 24, 25 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.