రైతు కుటుంబం రేషన్ కార్డు ప్రామాణికం
- 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్
- రూ.2 లక్షల కన్నా ఎక్కువ రుణం ఉంటే మిగతాది రైతు చెల్లించాలి
- ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీఎస్‌కు వర్తించదు
- ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల
- వివరాలకు వెబ్‌పోర్టల్, మండల సహాయ కేంద్రాలను సంప్రదించాలి
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి) : పంటల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వరిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలను మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని తెలిపింది.
పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేయనున్నారు. ఎస్‌హెచ్‌జీ, జెఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీఎస్ రుణాలకు, రీ షెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతులకు సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొం ది. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ కానీ, మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది.
మినహాయింపులు :
1. రుణమాఫీ ఎస్‌హెచ్‌జీలు, జేఎల్‌జిలు, ఆర్‌ఎంజిలు, ఎల్‌ఇసిఎస్‌లకు తీసుకున్నరుణాలకు వర్తించదు.
2. ఈరుణమాఫీ పునర్ వ్యవస్థీకరించిన , రీషెడ్యూల్ చేసిన రుణాలు వర్తించదు.
3. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు, పీఎసీఎస్‌ల ద్వారా తీసుకున్న రుణాలు.
4. కేంద్రం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది.
రైతుల బాధ్యత ఈపథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమా చారం ఇచ్చినట్టు గుర్తిస్తే, మోసపూరితంగా పంట రుణం పొందినట్లు కనుగొంటే పొందిన రుణమాఫీ మొత్తం రైతు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈమొత్తం రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాకులవారికి అధికారం ఉంటుంది.
పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం
పథకం గురించి రైతుల సందేహాలకు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగం స్థాపించాలి. రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్ ద్వారా, మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద తెలియజేయవచ్చు. ప్రతి అభ్యర్థనను సంబంధిత అధికారులు 30 రోజుల లోపు పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలిపాలి.
మార్గదర్శకాలు:
1. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 2లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది.
2. ఈపథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
3. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచీల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈపథకం వర్తిస్తుంది.
4. 12.12. 2018 తేదీ నుంచి మంజూరైన, రెన్యువల్ అయిన రుణాలకు 9. 12. 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
5. ఈపథకం కింద ప్రతి రైతు కుటుంబం రూ. 2లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 9. 12. 2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్త పథకానికి అర్హత కలిగి ఉంటుంది.
6. రైతు కుటుంబ నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటా బేస్ ప్రామాణికంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఇంటి యాజమాని జీవిత భాగస్వామి పిల్లలు ఉంటారు.
7. అర్హత గల రుణమాపీ మొత్తం డీబీటీ పద్దతిలో నేరుగా లబ్దిదారుల రైతు రుణఖాతాలకు జమ చేయబడుతుంది. పీఏసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తం డీసీసీబీ బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆబ్యాంకు వారు రుణమాఫీ మొత్తం పీఏసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు.
8. ప్రతి రైతు కుటుంబానికి 9.12. 2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తం జమ చేయాలి.
9. ప్రతి రైతు కుటుంబానికి 9. 12. 2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ, రూ. 2లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆమొత్తం ఆ రైతు కుటంబం పొందే అర్హత ఉంటుంది.
10. ఏ కుటుంబానికి అయితే రూ.2 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ. 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. ఆతరువాత అర్హత గల రూ. 2 లక్షల మొత్త రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
11. రూ. 2 లక్షలు కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణ తీసుకున్న మహిళల రుణం మొదట మాఫీ చేసి, మిగులు మొత్తం దామాషా పద్దతిలో కుటుంబ పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.