calender_icon.png 6 January, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భరణం మంజూరుకు మార్గదర్శకాలు

13-12-2024 01:34:38 AM

* ఆర్థిక పరిస్థితి ఆధారంగానే భరణం

* విడాకుల కేసుల్లో వీటిని పాటించాలి

* న్యాయస్థానాలకు సుప్రీం ధర్మాసనం సూచన

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ వైవాహిక చట్టాల దుర్వినియోగం, భరణం మంజూరు చేయడంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్య లు చేసింది. భార్యాభర్తల విడాకుల సమయంలో మహిళలకు భరణంగా చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించేందుకు ఎనిమిది మార్గదర్శకాలతో కూడిన విధివిధానాలను సుప్రీం కోర్టు నిర్దేశించింది. భరణాన్ని నిర్ణయించే క్రమంలో ఈ ఎనిమిది అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని దేశంలో ని అన్ని న్యాయస్థానాలను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజూ జైన్ విడాకుల కేసులో తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్ జస్టిస్ ప్రసన్న వి వర్లేలతో కూడిన ధర్మాసనం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. 

ఎనిమిది మార్గదర్శకాలు..

* భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి

* భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలపై అంచనాకు రావాలి

* ఇరువురి ఉద్యోగ, విద్యార్హతలు, ఉద్యోగ హోదాల వివరాలు తెలుసుకోవాలి.

* భార్యాభర్తల ఆదాయం, ఆస్తుల మూ లాల సమాచారాన్ని తెలుసుకోవాలి.

* తన అత్తమామల ఇంట్లో నివసిస్తున్నప్పుడు భార్య జీవన ప్రమాణ ఎలా ఉండేదో తెలుసుకోవాలి

* కుటుంబ పోషణ కోసం ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసిందా లేదా అనే సమాచారాన్ని తెలుసుకోవాలి

* ఉద్యోగం చేయని భార్య కోసం న్యాయపోరాటం చేయడానికి అవసరమైన డబ్బును అందించాలి

*భర్త ఆర్థికస్థితి, అతడి సంపాదన, బాధ్యతలు, భరణం కలుపుకుని అతడి మొత్తం నెలవారీ లేదా వార్షిక ఖర్చులు ఎంతవరకు అవుతాయనేది అంచనా వేయాలి.