02-03-2025 12:00:00 AM
నోములు, పెళ్లి వేడుకల్లో ముత్తుదువులకు తాంబూలం, వాయనం ఇచ్చి పంపడం మన ఆనవాయితీ. మా ఆహ్వానాన్ని మన్నించి, మీరు మా ఇంటికి వచ్చారు. వచ్చి మమ్మల్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు’ అన్నదానికి ప్రతీకగా ఈ తాంబూలం ఇస్తాం. దానిలో తమలపాకులు, పండ్లు, వక్క ప్రధానం. కొందరు పసుపు, కుంకుమలు, పూలు, గాజులు, జాకెట్ ముక్క వంటివాటితో పాటు గిఫ్ట్‌నీ జోడిస్తుంటారు. ఇంటి సంప్రదాయం బట్టి, ఒక్కొక్కరూ ఒక్కోలా ఇస్తుంటారు. ఈ మధ్య వాటినీ అందంగా ఇవ్వడం సాధారణం అయిపోయింది.
దీంతో ప్లాస్టిక్ తమలపాకులతో పాటు కాస్త పసుపు, కుంకుమల్ని విభిన్న ఆకారాల్లో చేసిన బొమ్మల్లో ఇస్తున్నారు. చూడటానికి ఆకట్టుకునేలా ఉంటాయన్నది వాస్తవమే. వాటిని ఎదుటివారు ఉపయోగించుకోగలుగుతున్నారా అన్నదీ గమనించాలి. వాటిని ఉపయోగించుకోనూలేరు.. వెంటనే పారేయనూలేరు. కొన్నాళ్లకైనా అవి చేరేది చెత్తలోకే. అంటే డబ్బు వృథా. పర్యావరణానికీ హాని కలిగిస్తున్నాం. మనం ఇచ్చిన తాంబూలంలోనివన్నీ అవతలివారు ఉపయోగించుకుంటేనే దానికి సార్థకత. కాబట్టి కొనేముందు వినియోగించుకునేలా ఉన్నాయా అని గమనించుకోవాలి.