calender_icon.png 22 November, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూడేల్లో గుట్టుగా గుడుంబా తయారీ

22-11-2024 12:17:22 AM

  1. వనపర్తి జిల్లాలోని మూడు మండలాల్లో విక్రయాలు
  2. నామమాత్రపు దాడులతో సరిపెడుతున్న ఎక్సైజ్‌శాఖ

వనపర్తి, నవంబర్ 21 (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో గుడుంబా తయారీ, అమ్మకాలు జోరందుకున్నాయి. మారుమూల గూడెలు, తండాలు, పంచాయతీల్లో ఇప్పుడు గుడుంబా వాసన గుప్పుమంటున్నది. ఎంతోమంది ఆ మహమ్మారిని సేవించడం అలవాటు పడి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు పెద్ద దిక్కును సైతం కోల్పోతున్నాయి.

గుడుంబా తయారీని శాశ్వతంగా నిర్మూలించామని ఎక్సైజ్‌శాఖ గొప్ప చెప్తున్నప్పటికీ, దానిలో వాస్తవం లేదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. జిల్లాల్లో పంట పొలాలు, చిన్న చిన్న గృహాలు, టీ స్టాళ్ల కేంద్రంగా జోరుగా గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ఎక్సైజ్‌శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ మండలాల్లో తీవ్రత..

జిల్లాలోని వనపర్తి, ఘన్‌పూర్, పెద్ద మంద డి మండలాల్లో ఎక్కువగా గుడుంబా తయారీ స్థావరాలు ఉన్నట్లు సమాచారం. ఇతర మండలాల కంటే ఇవే మండలాల్లో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. విస్కీ, బీరు, బ్రాందీ కొనేందుకు  ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి రావడంతో మందుబాబులు గుడుంబా వైపు మళ్లుతున్నారు.

ఈ బలహీనతను తయారీదారులు క్యాష్ చేసుకుంటు న్నారు. ఒక్క గుడుంబా సీసాను రూ.150 నుం చి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. గ్లాస్ లెక్కన అయితే ఒక గ్లాస్‌కు రూ.20 వరకు వసూలు చేస్తున్నారు.

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌శాఖకు సమాచారం అందుతున్నప్పటికీ అధికారులు, సిబ్బంది తూతూమంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్నేళ్లుగా గుడుంబా వాసన లేదని, తాజాగా విక్రయాలు జోరందుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. 

దాడులు చేస్తున్నాం.. కేసులు పెడుతున్నాం.. 

గుడుంబా స్థావరాలపై నిత్యం దాడులు చేస్తున్నాం. తయారీ దారులపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎవరైనా గుడుంబా తయారు చేస్తున్నట్లు గుర్తిస్తే, ప్రజలు వెంటనే స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలి. వారి వివరాలను ఎక్సైజ్‌శాఖ గోప్యంగా ఉంచుతుంది.

శ్రీనివాస్, ఎక్సైజ్ 

అండ్ ప్రొహిబిషన్  

సూపరింటెండెంట్, వనపర్తి