calender_icon.png 7 November, 2024 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నైకి ఝలక్

11-05-2024 02:02:10 AM

గుజరాత్ చేతిలో పరాజయం

గిల్, సుదర్శన్ శతకాలు

ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గుజరాత్ టైటాన్స్ ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే నాకౌట్ అవకాశాలు దాదాపు దూరం చేసుకున్న 

గుజరాత్ పోతూ పోతూ చెన్నైకి గట్టి దెబ్బ కొట్టింది. ఇక సీఎస్కే ముందడుగు 

వేయాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక నెగ్గడంతో పాటు.. ఇతర జట్ల 

ఫలితాలు కలిసిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంతగడ్డపై ఓపెనర్లు గిల్, సుదర్శన్ సెంచరీలతో చెలరేగడంతో టైటాన్స్ భారీ స్కోరు చేసింది. ప్రపంచలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో వీరిద్దరూ బౌండ్రీలు సిక్సర్లతో చెలరేగిపోయి తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేయగా.. ఛేదనలో చెన్నై టాపార్డర్ విఫలమైంది. డారిల్ మిషెల్, మోయిన్ అలీ అర్ధశతకాలతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు! 

అహ్మదాబాద్: ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు దూరమైన సమయంలో గుజరాత్ జెయింట్స్ సమష్టిగా సత్తాచాటింది. మిగిలిన అన్నీ మ్యాచ్‌లు నెగ్గినా.. నాకౌట్‌కు చేరడం క్లిష్టమైన తరుణంలో గుజరాత్ కీలక విజయం నమోదు చేసుకోవడంతో పాటు.. చెన్నై సూపర్ కింగ్స్ అవాకశాలకు గండికొట్టింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ జెయింట్స్ 35 పరుగుల తేడాతో చెన్నైను చిత్తుచేసింది. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి ఎగబాకగా.. చెన్నై నిలకడగా నాలుగో స్థానంలోనే ఉంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.చెన్నైపై ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఓపెనర్లు సాయి సుదర్శన్ (51 బంతుల్లో 103; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించారు.

ఐపీఎల్లో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. గతంలో లక్నో ఓపెనర్లు డికాక్, కేఎల్ రాహుల్ కూడా తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులకు పరిమితమైంది. డారిల్ మిషెల్ (34 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), మోయిన్ అలీ (36 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓపెనర్లు అజింక్యా రహానే (1), రవీంద్ర జడేజా (1)తో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) విఫలం కాగా.. దూబే (21), జడేజా (18) ధాటిగా ఆడలేకపోయారు. ఆఖర్లో ధోనీ (11 బంతుల్లో 26 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యా యి. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3, రషీద్ రెండు వికెట్లు పడగొట్టారు. లీగ్‌లో భాగంగా శనివారం కోల్‌కతాతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. 

చెన్నైని చితక్కొట్టారు!

తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ స్టేడియంలో శుభ్‌మన్ గిల్ చెలరేగిపోయాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ గణాంకాలు ఉన్న సొంత మైదానంలో చెన్నై బౌలర్లపై గిల్ దండయాత్ర చేశాడు. ప్లే ఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయిన వేళ.. గిల్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన సాయి సుదర్శన్ దంచికొట్టడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. శాంట్నర్ వేసిన తొలి ఓవర్‌లోనే 4,6 బాది తన ఉద్దేశాన్ని చాటిన గిల్.. ఇన్నింగ్స్ మొత్తం అదే జోరు కొనసాగించాడు. గిల్, సుదర్శన్ జోడీ ఏమాత్రం తొందరపడకుండా.. చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడుతూ ముందుకు సాగింది. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసేసరికి టైటాన్స్ 58 పరుగులతో నిలిచింది. స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగానికి కళ్లెం పడుతుందని అనుకున్నా అదీ కలగానే మిగిలింది.

జడేజా ఓవర్‌లో 4,6 కొట్టిన సుదర్శన్ 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. కాసేపటికి గిల్ 25 బంతుల్లోనే హాఫ్‌సెం చరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ గేర్లు మార్చడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగాన్నందుకుంది. ఈ క్రమంలో లీగ్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా సుదర్శన్ రికార్డుల్లోకెక్కాడు. శాంట్నర్ ఓవర్‌లో 4,6తో సాయి సెంచరీకి సమీపించగా.. మిషెల్‌కు మూడు సిక్సర్లు రుచిచూపిన గిల్ కూడా అతడి బాటలోనే నడిచాడు. ఒకే ఓవర్‌లో సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ ఇద్దరూ.. స్కోరు పెంచే క్రమంలో మరుసటి ఓవర్‌లో పెవిలియన్ బాటపట్టారు. మిల్లర్ భారీ షాట్లు కొట్టడంలో విఫలం కాగా.. చెన్నై బౌలర్లు చివర్లో పట్టు బిగించడంతో గుజరాత్ మరింత భారీ స్కోరు చేయలేకపోయింది.