- కొత్త ట్రాన్స్‌ఫార్మర్ అమర్చేందుకు మూడు నెలల సమయం
- జెన్కో ఇంజినీర్ల బృందం విచారణలో వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 5 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా మణుగూరు శివారులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో గత నెల 29న పిడుగుపడి జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమైందన్న విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే.. పిడుగు పడిన విషయం నిజం కాదని, అధికారులు, సిబ్బంది నిర్వాహణ లోపంతోనే మంటలు ఎగిసి ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమైనట్లు తాజాగా జెన్కో ఇంజినీర్ల బృందం తేల్చింది. బీటీపీఎస్ ప్రాథమికంగా రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ట్రాన్స్‌ఫార్మర్‌ను విడదీసి చూస్తే నష్టం మరింత పెరగవచ్చని చెప్పారు. దీనిపై వాస్తవాలను వెలికి తీసేందుకు జెన్కో బృందం రంగంలోకి దిగింది.
దగ్ధమైన జీటీ ట్రాన్స్‌ఫార్మర్ ఇక పనిచేయదని, దాని స్థానంలో కొత్తది అమర్చాలని తేల్చింది. కొత్త జీటీ ట్రాన్స్‌ఫార్మర్ కూడా స్థానికంగా దొరకదని, కొత్త యంత్రాన్ని తెచ్చి ఇక్కడ అమర్చేందుకు సుమారు 3 నెలల సమయం పడుతుందని తేల్చినట్లు సమాచారం. అప్పటివరకు ప్లాంట్ పరిధిలోని 1వ యూనిట్ 270 మెగావాట్ల ప్లాంట్‌లో రోజుకు 6.48 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని, దీంతో జెన్కోకు రూ.కోట్లలో నష్టం ఏర్పడుతుందని విశ్వసనీయ సమచారం. ప్రమాదాన్ని ముందగానే పసిగట్టి ఉంటే బాగుండేదని, ప్రమాదం సంభవించినప్పుడు 87హెచ్‌వీ స్పందించక పోవడంతోనే నష్ట తీవ్రత పెరిగిందని జెన్కో బృందం తేల్చినట్లు సమాచారం.