calender_icon.png 10 October, 2024 | 7:59 AM

ఔషధాలు, బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు?

04-10-2024 12:12:47 AM

త్వరలో మంత్రుల గ్రూప్ నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఔషధాలు, వైద్య సంబంధిత ఉత్పత్తులు, ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రీమియంలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూప్ (జీవోఎం) యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరలో తుది నిర్ణయం తీసుకుం టుందని సమాచారం.

జీఓఎం ఇటీవల సమావేశమై 12 శాతం శ్లాబ్‌లో ఉన్న ఐటెమ్స్ సంఖ్యను కుదించే అంశంతో పాటు మెడికల్, ఫార్మా సంబంధిత 100 ఇటెమ్స్‌పై పన్ను శ్లాబ్‌ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశమై చర్చించింది. ట్రాక్టర్లపై కూడా జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కమిటీ భావిస్తున్నది.

ట్రాక్టర్ల వర్గీకరణనుబట్టి ప్రస్తుతం 12 శాతం, 28 శాతం చొప్పున జీస్టీ ఉన్నది. సామాన్యుడికి ఊరటనిచ్చేందుకు కొన్ని ఐటెమ్స్ పన్ను శ్లాబ్‌ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనతో పాటు మరోవైపు పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు గతంలో 28 శాతం శ్లాబ్ నుంచి 178 ఐటెమ్స్‌ను దిగువ శ్లాబ్‌కు మార్చిన చర్యల్ని పునర్‌పరిశీలించాలని కమిటీ యోచిస్తున్నది..

రూ.40 లక్షలకు పైబడి ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని పెంచాలని కమిటీ భావిస్తున్నది.  హెయిర్ డ్రయర్స్, హెయిర్ కర్లర్స్, మరికొన్ని బ్యూటీ సాధనాల శ్లాబ్‌ల్ని తిరిగి 18 శాతం నుంచి 28 శాతానికి పెంచే అవకాశం ఉన్నది.  ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం శ్లాబుల్లో జీఎస్టీ పన్ను రేట్లు అమలవుతున్నాయి. నిత్యావసరాలకు పన్నును మినహా యించడమో లేదా కనిష్ఠశ్లాబ్‌లో పన్ను వసూలు చేస్తుండగా, లగ్జరీ, డీమెరిట్ ఐటెమ్స్‌కు గరిష్ఠ శ్లాబ్‌లో పన్ను రేటు ఉన్నది. 

ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ 12 శాతానికి తగ్గించే అవకాశం

ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించాలని కూడా ఇందుకోసం ఏర్పాటైన మంత్రుల కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. లైఫ్ టెర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్నును 5 శాతానికి తగ్గించాలని కమిటీ భావిస్తున్నది.

అయితే ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని విధిస్తుండగా, పన్నును పూర్తిగా ఎత్తివేయాలని, లేదంటే తగ్గించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఈ అంశమై నిర్ణయం తీసుకునేందుకు బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా ఏర్పాటైన మంత్రుల కమిటీ త్వరలో సిఫార్సులను ఖరారు చేయనుంది.