calender_icon.png 18 October, 2024 | 12:55 AM

జీఎస్టీ హేతుబద్దీకరణకు కసరత్తు

27-09-2024 12:00:00 AM

అక్టోబర్ 20న మంత్రుల గ్రూప్ తదుపరి సమావేశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించేందుకు, పన్ను రేట్లను సమీక్షించేందుకు  జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూప్ (జీవోఎం) తాజాగా సమావేశమై 12 శాతం శ్లాబ్‌లో ఉన్న ఐటెమ్స్ సంఖ్యను కుదించే అంశంతో పాటు మెడికల్, ఫార్మా సంబంధిత 100 ఇటెమ్స్‌పై పన్ను శ్లాబ్‌ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశమై చర్చించింది.

ఆరుగురు సభ్యులుగల ఈ కమిటీ చర్చల్ని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి  చంద్రిమా భట్టాచార్య  గురువారం మీడియాకు వివరిస్తూ సామాన్యుడికి ఊరట కల్పించేదిశగా కొన్ని ఐటెమ్స్‌పై పన్ను శ్లాబ్‌ను తగ్గించే అంశాన్ని చర్చించినట్టు తెలిపారు. తదుపరి తమ కమిటీ సమాశం అక్టోబర్ 20న జరుగుతుందన్నారు. సైకిళ్లు, నీటి బాటిళ్లపై పన్నుల్ని హేతుబద్దీకరించే అంశం కూడా తమ చర్చల్లో భాగంగా ఉన్నదన్నారు. మరోవైపు పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు గతంలో 28 శాతం శ్లాబ్ నుంచి 178 ఐటెమ్స్‌ను దిగువ శ్లాబ్‌కు మార్చిన చర్యల్ని పునర్‌పరిశీలించాలని నిర్ణయించామని భట్టాచార్య వివరించారు.

అక్టోబర్ 20నాటి సమావేశం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ ముందు తమ సిఫార్సులను ఉంచుతామని తెలిపారు. హెయిర్ డ్రయర్స్, హెయిర్ కర్లర్స్, మరికొన్ని బ్యూటీ సాధనాల శ్లాబ్‌ల్ని తిరిగి 18 శాతం నుంచి 28 శాతానికి పెంచే అవకాశం ఉన్నది.  ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం శ్లాబుల్లో జీఎస్టీ పన్ను రేట్లు అమలవుతున్నాయి. నిత్యావసరాలకు పన్నును మినహా యించడమో లేదా కనిష్ఠశ్లాబ్‌లో పన్ను వసూలు చేస్తుండగా, లగ్జరీ, డీమెరిట్ ఐటెమ్స్‌కు గరిష్ఠ శ్లాబ్‌లో పన్ను రేటు ఉన్నది. 

బీమా ప్రీమియంపై జీఎస్టీ

-అక్టోబర్ 19న సమావేశం

ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశమై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ అక్టో బర్ 19న సమావేశమవుతుందని అధికారులు తెలిపారు. బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని విధిస్తుండగా, పన్నును పూర్తి గా ఎత్తివేయాలని, లేదంటే తగ్గించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఈ అంశమై నిర్ణయం తీసుకునేందుకు బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా ఒక మంత్రుల కమిటీని కౌన్సిల్ నియమించింది. ఈ కమిటీ అక్టోబర్ నెలాకరుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నది. ఈ నివేదిక ఆధారంగా నవంబర్‌లో జరిగే కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.