కోరుట్ల, జనవరి13: బీడీ పరిశ్రమపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్’రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యా ల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రం సి.ప్రభాకర్ భవన్లో బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ర్ట మహాసభల సన్నాహక ప్రక్రియలో భాగంగా ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ర్ట మహాసభల కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి చాడ వెంకట్’రెడ్డి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై జీఎస్టీ రద్దు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే బీడీ పరిశ్రమ కుదేలయ్యే దిశలో ఉందని, జిఎస్టి అదనపు భారంతో బీడీ పరిశ్రమను మరింత కుంగిపోయేలా చేయకూడదన్నారు. బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ర్ట మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులకు పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణానికి చెందిన దివంగత కార్మిక సంఘ జాతీయ నేత సి.ప్రభాకర్ ఈ సంఘాన్ని స్థాపించాడని, ఆయన స్థాపించిన కోరుట్లలోనే తెలంగాణ రాష్ర్ట మొదటి మహాసభలు జరగటం కార్మికవర్గ చైతన్యానికి ప్రతిరూపమన్నారు.
బీడీ కార్మిక సంక్షేమ పథకాలు గతంలో మాదిరిగా మళ్లీ కొనసాగించాలని, బీడీ కార్మికుల కూలీ డబ్బు బ్యాంకు ఖాతాలో కాకుండా, కార్మికుల చేతికి ఏజెంట్ల ద్వారా ఇవ్వాల న్నారు. బీడీ కార్మికులకు ఇచ్చే జీవన భతిని 2016 నుండి రూ.4000 లకు పెంచుతామన్న రాష్ర్ట ప్రభుత్వ హామీని అమలు చేయాలని కార్మికుల పక్షాన డిమాండ్ చేశారు.
ఈనెల 30 న కోరుట్లలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ, 31న ప్రతినిధుల మహాసభల కార్మికులు, బీడీ పరిశ్రమ సిబ్బంది, ఆధిపతులు పాల్గొని విజయవంతం చేయాలని వెంకట్’రెడ్డి కోరారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు సుతారి రాములు, గోవర్ధన్, మౌలానా, ముక్రం, ఖాసిం, అనసూయ, శాంత, గోదావరి తదితరులు పాల్గొన్నారు.