calender_icon.png 15 January, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ మినహాయింపు!

20-10-2024 03:07:05 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: జీఎస్టీ రేట్ హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం పలు కీలక నిర్ణయాలను ప్రతిపాదించింది. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో దాదాపు 100 వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని సూచించింది. మరికొన్ని వస్తువులపై పన్నును పెంచాలని చెప్పింది. దీని ద్వారా రూ.22 వేల కోట్లు మిగులు వస్తుందని పేర్కొంది. మంత్రివర్గ ప్రతిపాదనలపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సందర్భంగా సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. కమిటీలోని ప్రతి సభ్యుడు సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కృషి చేశామని చెప్పారు. అందుకు తగినట్లు కొన్ని వస్తువులపై రేట్లు తగ్గించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. సీనియర్ సిటిజెన్లపైనా ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలోనే తమ సిఫార్సులపై నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు అందిస్తామని తెలిపారు.  

బీమాపైనే ప్రధాన దృష్టి

జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందం ప్రధానంగా భేటీ అయింది. ఇందులో సీనియర్ సిటిజెన్లతో పాటు రూ.5 లక్షల కవరేజీ ఉన్న ఆరోగ్య, జీవిత బీమాలపై పన్ను ఉపసంహరించాలని సభ్యులు ప్రతిపాదనలు చేశారు. టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు రూ.5 లక్షల కవరేజీ వరకు ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్నును మినహాయించాలని నిర్ణయించారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా కవరేజీకి చెల్లించే ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ యథావిధిగా కొనసాగుతుంది. ప్రస్తుతం టర్మ్, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు చెల్లించే జీవిత బీమా చందాలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అయితే దీన్ని తొలగించాలని కొన్ని నెలలుగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ కౌన్సిల్ గత నెలలో సమావేశమై 13 మంది సభ్యులతో క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించింది. దీనికి సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా ఉండగా యూపీ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ, గోవా, గుజరాత్, మేఘాలయ, పంజాబ్, తమిళనాడుకు చెందిన మంత్రులు ఉన్నారు. అక్టోబర్ నెలఖారులోగా నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించాల్సి ఉంటుంది.