02-03-2025 12:41:27 AM
గతేడాది ఫిబ్రవరి కంటే ఒక్క శాతం వృద్ధి కేంద్రం వెల్లడి
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరిలో రూ.5,280 కోట్లు వచ్చి నట్టు కేంద్రం తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో రూ.5,211కోట్ల జీఎస్టీ వసూలు కాగా.. ఈ సారి 1 శాతం ఎక్కువ కావడం గమనార్హం. వాస్తవానికి జీఎస్టీ వసూళ్లలో ప్రభుత్వం ఆశించిన రాబడి రావడం లేదు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జీఎస్టీ రాబడిలో 18 శాతం వృద్ధిని అంచనా వేసింది. కానీ ఏ నెల కూడా ఆ మేరకు వసూలు కాలే దు. 2025, జనవరిలో 10 శాతం వృద్ధితో రూ.6,017కోట్ల జీఎస్టీ వసూలైంది. కానీ గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగిన జీఎస్టీ.. ఈ ఏడాది జనవరితో పోలిస్తే మాత్రం ఏకంగా 9 శాతం తగ్గింది. ఈ గణాంకాలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
11 నెలల్లో రూ.40,340 కోట్లు..
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11 నెలలు గడిచాయి. ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్యకాలంలో జీఎస్టీ రూ.40,340 కోట్లు వసూలైంది. గతేడాది ఇదే సమయానికి రూ.36, 949 కోట్లు వసూలయ్యాయి. గతేడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదైంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు దేశంలో రూ.1.56 లక్షల కోట్లతో అత్యధిక జీఎస్టీ వసూలైన రాష్ట్రంగా మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. రూ.77వేల కోట్లతో యూపీ, రూ.75 వేల కోట్లతో కర్ణాటక, రూ.69 వేల కోట్లతో తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
3.09 లక్షల స్టేట్ జీఎస్టీ వినియోదారులు..
రాష్ట్రంలో సెంట్రల్ కంటే స్టేట్ జీఎస్టీ వినియోగదారులే ఎక్కువ మంది ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి సెంట్రల్ జీఎస్టీ పరిధిలో 2,29,116 ఖాతాలు ఉండగా.. స్టేట్ జీఎస్టీ పరిధిలో 3,09,808 మంది ఉన్నారు. అయితే వృద్ధిరేటు పరంగా చూస్తే.. స్టేట్ కంటే.. సెంట్రల్ జీఎస్టీ పరిధిలోనే ఎక్కువ నమోదైంది. గతేడాదితో పోలిస్తే.. స్టేట్ జీఎస్టీ పరిధిలో 4.1 శాతం వృద్ధి రేటు నమోదైతే.. సెంట్రల్ జీఎస్టీ పరిధిలో 7.1 శాతం వృద్ధి రేటు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది.