అక్టోబర్‌లో రూ.1.87 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, నవంబర్ 1: ఈ ఏడాది అక్టోబర్‌లో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు ఆరు నెలల గరిష్ఠస్థాయికి చేరాయి. తాజాగా ముగిసిన నెలలో దేశంలో జీఎస్టీ వసూళ్లు 9 శాతం వృద్ధితో రూ. 1.87 లక్షల కోట్లకు పెరిగాయి. అంతేకాకుండా దేశీయ లావాదేవీల ద్వారా వసూలైన పన్నులు రికార్డుస్థాయిలో నమోదయినట్లు శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.2.10 లక్షల కోట్ల వసూళ్ల తర్వాత అధికంగా ఈ అక్టోబర్‌లోనే వసూలయ్యాయి. 2024 అక్టోబర్‌లో రూ.33,821 కోట్ల సెంట్రల్ జీఎస్టీ, రూ. 41,964 కోట్ల స్టేట్ జీఎస్టీ, రూ.99,111 కోట్ల ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూలయ్యింది. సెస్‌గా మరో రూ.12,550 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. స్థూలంగా జీఎస్టీ ఆదాయం 8.9 శాతం వృద్ధితో రూ. 1.87 లక్షల కోట్లకు చేరింది.
నిరుడు అక్టోబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లు. దేశీయ లావాదేవీల ద్వారా ఈ అక్టోబర్‌లో రూ.1.42 లక్షల కోట్లు వస్తు, సేవల పన్నులు వసూలుకాగా, దిగుమతులపై పన్నులు 4 శాతం వృద్ధితో రూ.45,096 కోట్లకు పెరిగాయి. 2024 అక్టోబర్‌లో రిఫండ్స్ 18.2 శాతం పెరిగి రూ. 19,306 కోట్లకు చేరాయి. ఈ రిఫండ్స్‌ను సర్దుబాటు చేయగా, నికర జీఎస్టీ వసూళ్ళు 8 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్ల వద్ద నిలిచాయి.