డిసెంబర్‌లో 7.3 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జనవరి 1: డిసెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 7.3 శాతం వృద్ధిచెంది రూ.1.77 లక్షల కోట్లకు చేరాయి. 2023 డిసెంబర్‌లో రూ.1.65 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యింది. అయితే 2024 నవంబర్‌లో నమోదైన రూ.1.82 లక్షల కోట్లకంటే డిసెంబర్‌లో స్వల్పంగా తగ్గాయి. దేశంలో జీఎస్టీ ద్వారా రికార్డు వసూళ్లు 2024 ఏప్రిల్‌లో నమోదయ్యాయి.
ఆ నెలలో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 2024 డిసెంబర్‌లో రూ.22,490 కోట్ల విలువైన రిఫండ్స్ జారీ అయ్యాయి. ఏడాది క్రితంతో పోలిస్తే రిఫండ్స్ 31 శాతం పెరిగాయి. రిఫండ్స్‌ను సర్దుబాటుచేయగా నికర జీఎస్టీ వసూళ్లు 3.3 శాతం వృద్ధిచెంది రూ.1.54 లక్షల కోట్లకు చేరాయి.
బుధవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 డిసెంబర్‌లో వసూలైన జీఎస్టీలో రూ.32,836 కోట్లు సెంట్రల్ జీఎస్టీ వసూళ్లుకాగా, స్టేట్ జీఎస్టీ ద్వారా రూ.40,499 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ వసూళ్లు రూ. 47,783 కోట్లు, సెస్ వసూళ్లు రూ.11,471 కోట్లుగా ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ముగిసిన డిసెంబర్ నెలలో దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ 8.4 శాతం వృద్ధితో రూ.1.32 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులపై వసూలైన పన్నుల ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.44,268 కోట్లకు పెరిగింది.
తెలంగాణలో వసూళ్లు 10 శాతం వృద్ధి
తెలంగాణ రాష్ట్రంలో 2024 డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు జాతీయ సగ టుకంటే అధికంగా నమోదయ్యాయి. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం డిసెంబర్‌లో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 10 శాతం వృద్ధితో రూ.5,224 కోట్లకు పెరిగాయి. 2023 డిసెంబర్‌లో రూ.4,753 కోట్ల వస్తుసేవల పన్ను రాష్ట్రంలో వసూలయ్యింది.