ప్రీ లాంచ్ ముసుగులో.. రూ.200 కోట్ల మోసం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): ప్రీ లాంచ్ ముసుగులో నమ్మబలికి వందలాది మంది నుంచి సుమారు రూ. 200 కోట్ల వరకు వసూలు చేసి పరారైన నిందితుడిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఎకనామిక్ అఫెన్స్ వింగ్) బృందం గురువారం అరెస్ట్ చేసింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు స్థలాలు, ప్లాట్లు, విల్లాలు ఇస్తామని గుంటుపల్లి శ్రీనివాస్ రావు అనే వ్యాపారి కొన్నేళ్ల క్రితం జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థ ప్రారంభించాడు. కొల్లూరు, యాదాద్రి, నారాయణఖేడ్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ‘ఈవీకే ప్రాజెక్టు’ పేరిట గ్రూప్ విల్లాలు, అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తున్నామని ప్రకటించాడు.
రెండేళ్లలో పెట్టిన పెట్టుబడి రెండింతలు అవుతుందనిబ ఆకర్షణీయమైన బ్రోచర్ల ద్వారా ప్రచారం ప్రారం భించాడు. అందుకు ప్రత్యేకంగా మార్కెటింగ్ బృందాలను ఏర్పాటు చేశాడు. అలా క్షేత్రస్థాయిలోకి వెళ్లి వందలాది మందితో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టించి విల్లాలు, ప్లాట్లు కొనిపించాడు. ఖాళీ స్థలాని చూపిస్తూ ఒక్కో కొనుగోలుదారుడి నుంచి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. కస్టమర్లకు నమ్మకం కలిగించేందుకు వారికి చెక్కులు, బాండ్ పేపర్లు (ఎంవోయూ) ఇస్తూ వచ్చాడు. తర్వాత ఏమైందో తెలియదు గానీ, తమ సంస్థ కన్‌స్ట్రక్షన్ పనులను చేపట్టడం లేదని, వేరే సంస్థకు ఆ పనులు అప్పగిస్తున్నామని ప్రకటించాడు.
అనంతరం నిర్దేశిత సమయానికి నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో పెట్టుబడి పెట్టిన వారు జీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా కార్యాలయానికి వెళ్లి ఎండీ శ్రీనివాసరావును నిలదీశారు. దీంతో శ్రీనివాసరావు ప్రత్యేకంగా మనుషులను పెట్టి బాధితులను బెదిరింపులు ప్రారంభించాడు. ఇటీవల మోతినగర్‌కు చెందిన మోతామర్రి కార్తీక్ అనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ తర్వాత మరికొందరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి గోడు వెల్లబోసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు.