తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (ఏఏటీటీ) కార్యవర్గం ఎన్నికలు ఈ నెల 31న జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమవేశంలో జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) అభ్యర్థి గుత్తికొండ భార్గవ తమ జీఎస్ హరి ప్యానెల్ నుంచి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆమె తమ మ్యానిఫెస్టోను వివరిస్తూ.. ఒక్కో తెలుగు సీరియల్‌లో ఒక్క పర భాష ఆర్టిస్టుకు మాత్రమే అనుమతి ఇచ్చేలా చూస్తామని, వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్ధతిని నిర్మాతలు, ఛానల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తామని, అర్హులైన పేద కళాకారులకు పెన్షన్లు ఇప్పిస్తామని, మెడీ క్లయిమ్ పాలసీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపునకు కృషి చేస్తామని, నాగబాబు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీనగర్ ఏర్పాటు అయ్యేలా పోరాటం చేస్తామని, మహిళా సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు చేసేలా చూస్తామని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్లరేషన్ కార్డుల కోసం ప్రయత్నం చేస్తామని, టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి, కొత్త తెలుగు కళాకారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తామని, ఈఎస్‌ఐ స్కీమ్‌ను వర్తింపజేస్తామని, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌ను అమలు చేయిస్తామని, ప్రతి మెంబర్‌కు ఉపాధి కల్పిస్తామని వివరించారు.
ఈ సందర్భంగా సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. టెలివిజన్ కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా వినోద్ బాల ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలిజవిన్ ఆర్టిస్టు అసోషియేషన్ అసోసియేషన్‌ను ప్రారంభించాం. ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమలు చేశామని గర్వంగా చెప్పగలుగుతున్నాం. మా అసోసియేషన్‌కే సొంత బిల్డింగ్ ఉంది. వందలాది మంది ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించాం. మెడీ క్లెయిమ్ చేయించాం. తెలుగు ఆర్టిస్టులకే అవకాశాలు ఇవ్వాలనేదే మా ప్రయత్నం. సీరియల్ షూటింగ్ టైమింగ్ విషయాలపై మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కొవిడ్ సమయంలో చిరంజీవి ట్రస్ట్, అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ల సహకారంతో ఆర్టిస్టులందరికి సహాయం చేశాం. పేద కళాకారులకు పెన్షన్ ఇచ్చాం. ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సమర్థులైన జీఎస్ హరి ప్యానెల్ సభ్యులకు మద్దతుగా ఉంటే టెలివిజన్ కళాకారుల సమస్యలు తీర్చుతూ, సంక్షేమంపై దృష్టిపెడతాం’ అన్నారు.
అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి మాట్లాడుతూ.. నటుడుగా ఒక దశలో నా జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో నన్ను ఆదుకుని నా నట జీవితాన్ని నిలబెట్టింది ఈ టెలివిజన్ రంగం. ఈ రంగానికి పెద్ద దిక్కుగా విజయ్ యాదవ్, వినోద్ బాల అందరికి సపోర్టుగా నిలుస్తున్నారు. అర్ధరాత్రి తలపు తట్టిన కూడా ఆదుకునే మంచి మనసున్న వారు. కరోనా సమయంలో పెద్దలు చిరంజీవి, తలసాని శ్రీనివాస్ సహకారంతో ఇంటింటికి నిత్యావసరాలు అందించే బాధ్యత తీసుకున్నది మన అసోషియేషన్‌ది. నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని గర్వంగా చెప్పగలను. విజయ్ యాదవ్, వినోద్ బాల ఆధ్వర్యంలో నా మీద నమ్మకంతో నాకు అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. నాకు అన్నం పెట్టిన ఈ పరిశ్రమ సంక్షేమం కోసం నేను నిరంతరం ప్రయత్రిస్తానని హామీ ఇస్తున్నాను’ అని తెలిపారు.
సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి, జనరల్ సెక్రటరీ అభ్యర్థి భార్గవ గొట్టికొండ, ట్రీజరర్ అభ్యర్థి చెన్నుపాటి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి రామ్‌జగన్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు జీఎస్ శశాంక్, కృష్ణ కిషోర్, ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థులు బ్యాంక్ శ్రీనివాస్, దీప్తి వాజ్‌పేయి, జాయింట్ సెక్రటరీ అభ్యర్థులు మేక రామకృష్ణ, వికాస్, దీప దుర్గంపూడి, మహిళ ఈసీ మెంబర్ అభ్యర్థులు రాగ మాధురి, లిరిష, మహతి రిజ్వానా, లక్ష్మిశ్రీ, ఈసీ మెంబర్ అభ్యర్థులు బాలాజీ, శివకుమార్ కాముని, విజయ్‌రెడ్డి, ద్వారకేశ్, మురళికృష్ణరెడ్డి, గోపికర్, మురళీకృష్ణ, టీవీ నటీనటులు పాల్గొన్నారు.