10-04-2025 08:14:38 PM
ఐటిడిఏ పిఓ రాహుల్..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో ప్రారంభించిన ట్రైబల్ మ్యూజియంను సందర్శించడానికి పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని, పర్యాటకులు మ్యూజియంను సందర్శించి, గిరిజన వంటకాలను తనివి తీరా ఆస్వాదిస్తున్నారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం సాయంత్రం మ్యూజియం ప్రాంగణంలో వివిధ రకాల గిరిజన వంటలకు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో నూతనంగా చైనీస్ ఫుడ్ కు సంబంధించిన స్టాల్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతతరం నాటి గిరిజన కళాఖండాలను సాంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పర్యాటకులకు ఆకర్షించేలా మ్యూజియంలో పొందుపరిచి సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం రోజున గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రారంభించక ముందు నుండే ప్రతిరోజు పర్యాటకుల తాకిడి ఎక్కువైందని అన్నారు.
మ్యూజియమును సందర్శించే పర్యాటకులు తప్పనిసరిగా సేంద్రీయ వంటకాలతో కల్తీ లేని పుష్టికరమైన గిరిజన వంటకాలను అందించడానికి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో ఆదివాసి సాంప్రదాయ వంటకాలు, డ్రాగన్ ఫ్రూట్, ఆదివాసి బొమ్మలు, ఓనమాలు మిల్లెట్ హబ్, ఆదివాసి సత్యం సమోసా పాయింట్ పాయింట్ ద్వారా పర్యాటకులు వివిధ తినుబండారాలు కొనుగోలు చేసి వాటి యొక్క రుచిని ఆస్వాదిస్తున్నారని అన్నారు. స్టాల్స్ నిర్వాహకులు స్టాల్స్ చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పర్యాటకులు కొనుగోలు చేసే తినుబండారాలను సరసమైన ధరలకు అమ్మకాలు జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, స్టాల్ ఆర్గనైజర్లు రాజేందర్, భూలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.