- ఆసిఫాబాద్ జిల్లాలో మరో మూడు కొత్త పీఏసీఎస్‌లు
- ఫిబ్రవరి 16తో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి వెన్నుముకల ఉన్న ప్రాథమిక సహకార సంఘాల పెంపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాల్లో 12 పీఎసీఎస్‌లు ఉన్నాయి.
కొత్తగా పెంచికల్‌పేట్, చింతలమానేపల్లి, లింగాపూర్ మండలాల్లో పీఎసీఎస్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సహకార సంఘాలను పునర్‌వ్యవస్థీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 16తో ప్రస్తుతం కొనసాగుతున్న సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగియనుంది.
దీంతో అన్ని పీఎసీఎస్‌లలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముందుకు వెళ్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు నిమగ్నం అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు.
ఎన్నికలు జరిగేనా?
మరో పక్షం రోజుల్లో సహకార సంఘాల పాలకవర్గాల కాలం ముగిస్తుంది. ఏడాది గడిచినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాలకవర్గాలు లేక అధికారులపై ఒత్తిడి పెరిగి, పాలన అస్థవ్యస్తంగా మారింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాల్సిన పీఎసీఎస్‌ల ఏర్పాటుతోపాటు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఉన్నవారినే కొనసాగిస్తారా అనే అంశంపై చర్చ జరుగుతున్నది.
ప్రతిపాదనలు నివేదించాం
జిల్లాలో 15 మండలాలున్నాయి. జిల్లా ఏర్పాటు అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన లింగాపూర్, పెంచికల్‌పేట్, చింతలమానేపల్లిలో ప్రాథమిక సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం. ఫ్రిబవరి 16తో ఇప్పుడు కొనసాగుతున్న పాలకవర్గాల సమయం ముగుస్తుంది. ఎన్నికల నిర్వహణ ప్రణాళికకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే ఎన్నికలను నిర్వహిస్తాం.
రాథోడ్ బిక్కు నాయక్,
జిల్లా సహకార అధికారి,
కుమ్రంభీం ఆసిఫాబాద్