కరీంనగర్ (విజయక్రాంతి): జిల్లాలో గ్రూప్-3 పరీక్ష మొదటిరోజైన ఆదివారం ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. హాల్ టికెట్, గుర్తింపు కార్డు పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థిని లోనికి పంపించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ (స్థానిక సంస్థలు) జిల్లాలోని తిమ్మాపూర్ లో ఉన్న శ్రీ చైతన్య, వాగేశ్వరి, విట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని ట్రినిటీ కాలేజీ, భగవతి హై స్కూల్, ఫండస్ హై స్కూల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ లు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల సీలును అదనపు కలెక్టర్, ఆర్డీఓ మహేశ్వర్, ఏసీపీ విజయ్ కుమార్, పరీక్ష రీజినల్ కో-ఆర్డినేటర్లు వరలక్ష్మి, సతీష్ సమక్షంలో తీశారు. అనంతరం అధికారులు స్ట్రాంగ్ రూమ్ ల నుంచి పోలీసు బందోబస్తు నడుమ పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించారు. సీఐలు కోటేశ్వర్, విజయ్ కుమార్, జాన్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెoడెంట్ కాళీ చరణ్ తదితరులు ఉన్నారు.