ముషీరాబాద్/కామారెడ్డి, డిసెంబర్ 24: గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం గ్రామపంచాయతీ పరిధిలోని అవుసులకుంట తండాకు చెందిన సురేఖ నాయక్ (24) ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని జవహర్‌నగర్‌లోని సాయి ప్రహరియా గర్ల్స్‌హాస్టల్లో ఉంటూ గ్రూప్స్‌కు సన్నద్ధమవుతోంది.
కాగా సురేఖ నాయక్ సోమవారం రాత్రి హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. గమనించిన హాస్టల్ విద్యార్థినులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్, డీఐ శేఖర్, ఎస్‌ఐ మౌనిక ఘటనా స్థలానికి చేరుకొని సురేఖను గాంధీ దవాఖానకు తరలించారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న సురేఖ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యపై అనుమానాలున్నాయి
గ్రూప్ మెయిన్స్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వేచిఉన్న సురేఖ ఇటీవలే గ్రూప్ పరీక్ష కూడా రాసింది. అయితే ఈనెల 7న నిజామాబాద్‌కు చెందిన వ్యక్తితో సురేఖకు ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ క్రమంలో సురేఖ ఆత్మహత్యకు పాల్పడటంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని ఆమె తల్లితండ్రులు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.