- నవంబర్ 17న పేపర్-1, 2
- మరుసటి రోజు పేపర్-3
- 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
- అరగంట ముందే గేట్లు క్లోజ్
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): గ్రూప్-3 పరీక్షల తేదీలను ఇప్ప టికే ప్రకటించిన టీజీపీఎస్సీ తాజాగా పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. హాల్ టికెట్లను నవంబర్ 10 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. నవంబర్ 17, 18వ తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2ను నిర్వహించనున్నారు. నవంబర్ 17న పేపర్- 1, 2; 18వ తేదీన పేపర్-3 పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసేస్తామని అధికారులు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లు, ప్రశ్నపత్రాలను భద్రపర్చుకోవాలని సూచించారు. 1380కిపైగా గ్రూప్-3 పోస్టులకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.