టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎంపికైన వారి జాబితా
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 8,084 మందితో కూడిన ప్రొవిజినల్ జాబితాను గురువారం విడుదల చేయగా.. ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
2022 డిసెంబర్ 1న 8,180 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌కు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి 2023 జూలైలో పరీక్ష నిర్వహించగా.. ఈ ఏడాది ఆగస్టులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.
రెండువేల బ్యాక్‌లాగ్ పోస్టులు!
కాగా ఇప్పటికే ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన చాలామంది గ్రూప్-4కు ఎంపికైన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో నిర్వహించిన ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఉద్యోగం పొందిన వారు.. గ్రూప్-4లో మంచి పోస్టు వస్తే అందులో జాయిన్ అవుతారు. లేనిపక్షంలో సుమారు రెండువేల పోస్టులు మిగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా మిగిలే పోస్టులన్నీ బ్యాక్‌లాగ్ కిందకు పోతాయి. ఒకవేళ గ్రూప్-4 ఫలితాలు విడుదలకు ముందే అన్‌విల్లింగ్ (ఈ ఉద్యోగం ఇష్టంలేదని) ఆప్షన్ ఇచ్చి ఉంటే మెరిట్ క్రమంలో ఇతరులు ఉద్యోగం పొందే అవకాశం ఉండేదని అభ్యర్థులు చెబుతున్నారు.
ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు విడుదల చేయడంతో మిగిలిన వారికి అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. గతంలోనూ గురుకుల ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు మిగలడంతో 2వేల మందికి అన్యాయం జరిగిందని గుర్తు చేశారు..