11-03-2025 12:31:57 AM
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. 563 గ్రూప్--1 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ప్రొవిజనల్ మార్కుల వివరాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సోమవా రం నాంపల్లిలోని కార్యాలయంలో విడుదల చేశారు. టీజీపీఎస్సీ తొలుత ప్రకటిం చిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలను విడుదల చేసింది.
ఈ పరీక్షలో అభ్యర్థులు పొం దిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. గతేడాది జరిగిన గ్రూప్--1 మెయిన్స్ పరీక్షలకు 21,093 హాజరయ్యారు. అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, మెయిన్స్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి పేపర్ల వారీగా మార్కుల వివరాలను పొందవచ్చని అధికారులు తెలిపారు.
గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్--1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఏడు పేపర్లుగా నిర్వహించి న ఈ పరీక్ష వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు మార్కుల వివరాలను తాజాగా అభ్యర్థుల లాగిన్‌లలో అం దుబాటులో ఉంచారు. ఈ మార్కులను మార్చి 16 సాయంత్రం 5గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
అభ్యర్థులు మెయిన్స్‌లో సాధించిన మార్కుల షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకొని రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్త య్యే వరకు వాటిని దాచి ఉంచాలని టీజీపీఎస్సీ ఈమేరకు సూచించింది. ఇదిలా ఉంటే ప్రొవిజనల్ మార్కుల వివరాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ అభ్యర్థులకు తమ మార్కుల రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో మార్చి 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మా త్రమే చేసుకోవాలని సూచించింది. అయితే ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున ఫీజు ఖరారు చేసింది. ఈ ఫీజును చెల్లించి మా ర్కుల రీకౌంటింగ్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ చేసుకునే అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖా స్తు చేసుకోవాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ తెలిపింది.
రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులందరి మొత్తం మార్కులను పరిగణలోకి తీసుకొని వాటిని కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. ఇలా తుది జనరల్ ర్యాంకింగ్స్ జాబితా (జీఆర్‌ఎల్)ను విడుదల చేసి దాని ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవనున్నారు. అయితే నోటిఫికేషన్‌లో సూచించినట్లుగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెం ట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.
మార్కుల షీట్‌లు డౌన్‌లోడ్/ రీకౌంటింగ్ దరఖాస్తుకు సంబంధించి ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు ఎదురైతే అభ్యర్థులు 040--23542185/040--23542187 లేదా టీజీపీఎస్సీ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించింది. ఈనెల 11న గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేయనుం ది. ఈనెల 20తేదీలోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించనుంది.
ఎట్టకేలకు ఫలితాలు..
ఎట్టకేలకు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత మొట్టమొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇది. ఈ నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంటోంది. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది.
అయితే ఇంతలోనే గ్రూప్-1 ప్రశ్నపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ అవడంతో ఆ పరీక్ష రద్దు అయింది. ఆతర్వాత మళ్లీ 2023 జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, పరీక్ష నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయని.. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని తదితర కారణాలతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
వాదనలు విన్న న్యాయస్థానం పరీక్షను రద్దు చేయాలని ఆదేశించడంతో ఆ పరీక్ష కూడా రద్దయ్యింది. ఆతర్వాత కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అదనంగా 60 గ్రూప్-1 పోస్టులు కలిపి మళ్లీ మొత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వేశారు. వీటికి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షను నిర్వహించిన ప్రభుత్వం తాజాగా ఫలితాలను విడుదల చేసింది.
ఇది లా ఉంటే అభ్యర్థుల వారీగా ఫలితాలను విడుదల చేయడంతో టాప్ స్కోర్ ఎవరికి ఎంత వచ్చిందనే జాబితాను విడుదల చేయలేదు. అయితే చాలామంది అభ్యర్థులకు 900 మార్కులకు గానూ 450 మా ర్కులు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. 440, 450 ఇలా వస్తే మంచి స్కోరు వచ్చినట్లుగా భావిస్తున్నారు. 500 క్రాస్ అయి నవారు చాలా తక్కువ మంది ఉండే అవకా శం ఉన్నట్లు సమాచారం. టాప్ స్కోర్ 500 పైగా ఉన్నట్లు అంచనా.