న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్ను రేటును సమీక్షించేందుకు 13 సభ్యులతో కూడిన మంత్రుల గ్రూప్ (జీవోఎం)ను జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. అక్టోబర్ 30కల్లా ఈ గ్రూప్ తన నివేదికను కౌన్సిల్‌కు సమర్పిస్తుంది. జీవో ఎం కన్వీనర్‌గా బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, కేరళ, గోవా, గుజరాత్, మేఘాలయ, పంజా బ్, తమిళనాడు మంత్రుల్ని సభ్యులుగా కౌన్సిల్ నియమించింది.
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రస్తుతం అమలవుతున్న పన్ను రేటును సమీక్షించేందుకు జీవోఎంను ఏర్పాటుచేయాలని సెప్టెంబర్ 9న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జీవోఎం నివేదిక ఆధారంగా వచ్చే నవంబర్ కౌన్సిల్ సమావేశంలో బీమా ప్రీమియంల పన్నుపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు.
వేర్వేరు వర్గాలకు వివిధ పన్ను రేట్లు?
కౌన్సిల్ తాజాగా ఏర్పాటు చేసిన జీవోఎం వివిధ వర్గాలకు ఆరోగ్య బీమాపై ఏ మేరకు పన్ను రేటు నిర్ణయించవచ్చనే అంశాన్ని కూడా సమీక్షించి సిఫార్సులు చేస్తుంది. వ్యక్తిగత, గ్రూప్, కుటుంబ బీమా, సీనియర్ సిటిజన్లు, మిడిల్‌క్లాస్ తదితరాలకు వేర్వేరుగా పన్ను రేట్లను సూచించే అవకాశం ఉంది. అలాగే జీవిత బీమాకు సంబంధించి టెర్మ్ పాలసీలు, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌తో కూడిన జీవిత బీమా పాలసీలు, వ్యక్తిగత లేదా గ్రూప్ పాలసీలు, రీఇన్సూరెన్స్‌లకు వివిధ పన్ను రేట్లను సూచించవచ్చు. 2024 అక్టోబర్ 30కల్లా జీవోఎం తన రిపోర్ట్‌ను సమర్పిస్తుందని ఆదివారం జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియల్ జారీచేసిన ఆఫీస్ మెమోరాండంలో వెల్లడించింది.
ప్రతిపక్ష పాలనలో ఉ న్న కొన్ని రాష్ట్రాలు బీమా ప్రీమియంలకు జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని డి మాండ్ చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదకు సానుకూలంగా ఉన్నాయి. బీమాపై జీఎస్టీని వ్యతిరే కిస్తూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సైతం గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ‘జీవిత బీమాపై జీఎ స్టీ విధించడమంటే అనిశ్చిత జీవితంపై పన్ను వేయడమేనని’ ఆ లేఖలో పేర్కొన్నారు.