calender_icon.png 28 September, 2024 | 8:46 AM

గ్రూప్-1 నోటిఫికేషన్ చెల్లదు

28-09-2024 02:44:17 AM

హైకోర్టులో మళ్లీ పిటిషన్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. జీ దామోదర్‌రెడ్డి మరో ఐదుగురు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పుల్లా కార్తీక్ శుక్రవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జే సుధీర్ వాదనలు వినిపిస్తూ 2022లో 503 పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేశారని, వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దయిందని తెలిపారు. అయితే గతంలో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకే దీన్ని పరిమితం చేయాల్సి ఉందన్నారు.

503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను కలిపి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని వాదించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉందని తెలిపారు. అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. దీనిపై తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 30కి వాయిదా వేశారు.