calender_icon.png 1 January, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదు!

07-12-2024 01:18:51 AM

  1. తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు
  2. పిటిషన్ కొట్టివేత.. రాష్ట్రప్రభుత్వానికి ఊరట
  3. మెయిన్స్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు 
  4. హైకోర్టు తీర్పునే సమర్థించిన ధర్మాసనం

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): గ్రూప్ -1 నోటిఫికేషన్ అంశంలో రాష్ట్రప్రభుత్వానికి ఊరట లభించింది. నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. నోటిఫికేషన్ రద్దు కుదరదని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పునే సమర్థించింది. అలాగే మెయిన్స్ ప్రక్రియ పూర్తి చేయాలని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

తెలిసిన వివరా ల ప్రకారం.. కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని, అలాగే ప్రిలిమ్స్‌లో 14 ప్రశ్నల్లో తప్పులు దొర్లినందున నోటిఫికేషన్ రద్దు చేయాలని ఏడుగురు అభ్యర్థులు జూలైలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అక్టోబర్‌లో హైకోర్టు విచారించింది.

ప్రిలిమ్స్ జరిగిన ఆరు నెలల తర్వాత కోర్టును ఆశ్రయించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రిలిమ్స్ కీ కి సంబంధించిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల ద్వారా రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని సూచించింది. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు గత నెల 18న సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.  పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.గురుకృష్ణ కుమా ర్ వాదన ప్రకారం.. ‘తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన సర్కార్ పాత నోటిఫికేషన్ ను పక్కన పెట్టింది. కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలి మ్స్ కీ లో 14 ప్రశ్నల్లో తప్పులు ఉన్నాయి. ఏడు ప్రశ్నలకు సాంకేతికంగా తప్పులు ఉన్నాయి.

దీని పై సబ్జెట్ నిపుణులు ఇచ్చిన నివేదికలో సైతం తప్పు ఉన్నాయ. మళ్లీ ప్రిలిమ్స్‌పై స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించాలి. కమిటీ నివేదిక వచ్చే వరకు మెయిన్స్‌ను వాయిదా వేయాలి. గ్రూప్ నోటిఫికేషన్ రద్దు చేయాలి’ ఈ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది.

రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జీవో 29పై హైకోర్టు విచారణ జరుపుతుందని తేల్చిచెప్పిం ది. హైకోర్టు ఆదేశాల మేరకే గ్రూప్-1 పోస్ట్‌ల భర్తీ ఉంటుందని ఖరాఖండిగా తెలిపింది. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే దాదాపు 30 వేల మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నది. పిటిషన్ దాఖలు చేసిన ఏడుగురిలో ఒక్కరు కూడా మెయిన్స్‌కు ఎంపిక కాలేదని గుర్తుచేసింది.

అందువల్ల పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణ అంశంలో కోర్టుల జోక్యం అనవసరమని అభిప్రాయపడింది. పిటిషన్ల కారణంగా పరీక్షల నిర్వహణ ఆలస్యమవుతున్నదని, అభ్యర్థుల అభ్యంతరాలను రాష్ట్రప్రభుత్వం పక్కనపెట్టాలని సూచించింది.

సత్వరం గ్రూప్-1 మెయిన్స్ ప్రక్రి య పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తరఫున సీనియర్ న్యాయ వాది నిరంజన్‌రెడ్డి, గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.

రాష్ట్రప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా

రాష్ట్రప్రభుత్వం 161 రోజులు ఆలస్యం గా రిట్ పిటిషన్ దాఖలు చేసినందుకు సుప్రీంకోర్టు శుక్రవారం రూ.లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే కోర్టు రిజిష్టరీ తగిన విధంగా నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. తెలిసిన వివరాల ప్రకారం.. రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (ఏవోవీఎన్) పథక లబ్ధి కోసం 2013లో నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.

ఆ విద్యార్థి తండ్రి వార్షిక ఆదా యం రూ.2 లక్షలకు మించి ఉందన్న కారణంతో సర్కార్ అతడి దరఖాస్తును తిర స్కరించింది. దీనిని సవాల్ చేస్తూ విద్యార్థి తండ్రి గంటా వెంకట నరహరి హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌ను 2023లో విచారించిన హైకోర్టు పిటిషనర్ కుమారుడికి రూ.10 లక్షల స్కాలర్‌షిప్ ఇవ్వాలని ఆదేశా లు జారీ చేసింది.

అలాగే విద్యార్థి తండ్రి వార్షిక ఆదాయంపై స్పష్టత ఇవ్వాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. పిటిషన్‌దారుడి ఆదాయ వివరాలతో 161 రోజుల తర్వాత హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును రాష్ట్రప్రభుత్వం సవా ల్ చేసింది. ఎంతో ఆలస్యమైందన్న వాదనలతో ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు తొసిపుచ్చింది. 

హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ... ఈ ఏడాది అక్టోబర్ 19న రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్డును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ జేపీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ దిసభ్య ధర్మాసనం విచారించింది. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు 161 రోజుల ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించిం ది. హైకోర్టులు హేతుబద్ధంగా తీర్పు ఇచ్చిందని, రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించొద్దన్న ఉద్దేశంతో రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు వారాల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది.