calender_icon.png 22 October, 2024 | 5:41 AM

పోలీస్ పహారాలో గ్రూప్-1 మెయిన్స్

22-10-2024 02:07:09 AM

  1. నిమిషం నిబంధనతో నో ఎంట్రీ
  2. సికింద్రాబాద్‌లో గోడదూకి వెళ్లేందుకు అభ్యర్థి యత్నం
  3. పరీక్షకు అనుమతించకపోవడంతో కోఠి మహిళావర్సిటీ వద్ద అభ్యర్థుల ఆందోళన
  4. సరళంగా ఇంగ్లిష్ క్వాలిఫయింగ్ పేపర్

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తొలిరోజు పోలీసుల పహారా నడుమ జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మెయి న్స్ పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించకపోవడంతో తొలిరోజు పలువురు అభ్యర్థులు కన్నీటిపర్యంతమయ్యా రు.  గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 27 వరకు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా, తొలిరోజు పలువురు అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.

సికింద్రాబాద్ పీజీ కాలేజీ సెంటర్‌లో నిర్దేశిత సమయం పూర్తికావడంతో అధికారులు గేట్‌కు తాళాలు వేశారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి తనను అనుమతించాలని కోరగా.. తామేం చేయలేమ ని అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఆ అభ్య ర్థి గోడ దూకేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోఠిలో మహిళా వర్సిటీ సెంటర్‌లోనూ సమయం దాటిన తర్వా త వచ్చిన వారిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మేడ్చ ల్ జిల్లాలో ఓ అభ్యర్థి ఒక పరీక్షాకేంద్రానికి బ దులు మరో పరీక్షాకేంద్రానికి రాగా, పోలీసులు ఆ అభ్యర్థిని సెంటర్‌కు సకాలంలో చేర్చారు. 

టెన్షన్.. టెన్షన్

పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠ నడుమ తొలి రోజు పరీక్ష జరిగింది. ఒకవైపు ఉదయం సుప్రీంకోర్టులో కేసు విచారణ, మరోవైపు మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష.. ఈ క్రమంలో పలు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా టాస్క్‌ఫోర్స్ పోలీసులను వినియోగించడంతో అభ్యర్థులు భ యాందోళనకు గురయ్యారు.

మొయినాబాద్‌లోని కేజీ రెడ్డి కాలేజీ సెంటర్‌లో  టాస్క్‌ఫోర్స్ పోలీసులు పహారా కాశారు. పరీక్షాకేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లు లోపలికి పంపారు. తల్లిదండ్రులు, సహాయకులు, చంటిపిల్లలతో వచ్చినవారిని సెంటర్ల వరకు అనుమతించలేదు. వాహనాల్లో వచ్చిన వారిని సెంటర్లకు దాదాపు 700 మీటర్ల ముందే నిలిపేశారు. దీంతో అభ్యర్థులు నడిచివెళ్లాల్సి వచ్చింది.  ఒకే హాల్‌టికెట్‌ను ఏడు రోజులు తీసుకురావాలని టీజీపీఎస్సీ సూచించింది.  

పేపర్ సరళం..

తొలిరోజు ఇంగ్లీష్ పేపర్ సరళంగానే వచ్చినట్లు పరీక్షరాసిన అభ్యర్థులు తెలిపారు. ఈ పేపర్‌లో ఎక్కువ మందే అర్హత సాధిస్తారని అంచనా వేశారు. వకాబులరీ నుంచి ప్రశ్నలు, దినపత్రిక ఎడిటర్‌కు గాలి కాలుష్యంపై లెటర్ రాయమనే ప్రశ్న, పాసెజ్ రైటింగ్, యాక్టివ్, పాసివ్ వాయిస్ లాంటి సులభమైన ప్రశ్నలు అడిగినట్లు పేర్కొన్నారు.