calender_icon.png 24 January, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-2పై గుంజాటన

05-07-2024 12:52:24 AM

  1.  డిసెంబర్‌లో నిర్వహించాలని డిమాండ్ 
  2. డీఎస్సీ, గ్రూప్ మధ్య ఒకే రోజు గ్యాప్ 

పోస్టులూ పెంచాలి 

సిటీ లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): పోటీ పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని కొద్ది రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు పట్టుపడుతున్నారు. డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్నాయి. గ్రూప్-2 పరీక్ష 7, 8 తేదీల్లో జరగనుంది. అయితే డీఎస్సీకి గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు మధ్యన ఒకే రోజు అంటే 6వ తేదీన గ్యాప్ ఉంది.

డీఎస్సీ రాస్తున్న వారు 2.79 లక్షల మంది ఉన్నారు. ఇందులో కనీసం 1.5 లక్షల మంది వరకు గ్రూప్-2 పరీక్షను కూడా రాస్తున్నారు. డీఎస్సీ సిలబస్, గ్రూప్-2, 3 సిలబస్‌లు వేర్వేరు. ఈ క్రమంలో ఒక రోజు గ్యాప్‌లో డీఎస్సీ రాసిన అభ్యర్థులు వెంటనే గ్రూప్ పరీక్షను ఎలా రాయగలుగుతారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

డిసెంబరే బెటర్ 

గ్రూప్-2 పరీక్ష ఆగస్టు 7, 8 తేదీల్లో ఉంది. అలాగే గ్రూప్-3 పరీక్ష నవంబర్‌లో ఉంది. ఈ రెండు పరీక్షలకు మధ్య రెండు నెలల సమయం ఉంది. కానీ, గ్రూప్-2, గ్రూప్-3కి దాదాపు ఒకే సిలబస్ ఉండడంతో గ్రూప్-2ను డిసెంబర్‌లో నిర్వహించాలని కోరుతున్నారు. దీంతో ఇటు డీఎస్సీ, అటు అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన గ్రూప్--1 మెయిన్స్ రెండూ పరీక్షలకు సన్నద్ధం కావడానికి తగిన సమయం దొరుకుతుందని అభ్యర్థుల వాదన. అదే విధంగా గ్రూప్-2, 3 పోస్టులను పెంచి గ్రూప్-2ను డిసెంబర్‌లో నిర్వహిస్తే అన్ని పరీక్షలు సజావుగా రాసుకునే అవకాశం తమకు దొరు కుతుందని అభ్యర్థులు ప్రభుత్వానికి డిమాండ్  చేస్తున్నారు. గ్రూప్-1, డీఎస్సీలో పోస్టులు పెంచినందున మిగిలిన గ్రూప్-2, 3లోనూ పెంచాలని కోరుతున్నారు.

పోస్టులు పెంచే యోచనలో సర్కారు 

నిరుద్యోగుల అభ్యర్థులు వరుసగా ఆందోళనలు, టీజీపీఎస్సీ, రాజ్‌భవన్ ముట్టడి, చలో అసెంబ్లీ లాంటి నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిరుద్యోగులతో సంప్రదింపులు చేసి వారి డిమాండ్లను నోట్ చేసుకుంది కూడా. బు ధవారం ప్రొఫెసర్ కోదండరాం, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నేతలు మానవతారాయ్ తదితరులు సీఎస్‌తో ఇదే అంశంపై భేటీ అయి చర్చించినట్లు తెలిసింది. పోస్టుల పెంపుపై సానుకూలంగా ఉండగా, పరీక్షలను వాయిదా వేయకుండా షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండడంతో నిరుద్యోగుల డిమాండ్లపై అధికారులు నిర్ణయం తీసుకోని పరిస్థితి ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే పోస్టులు పెంపు, పరీక్షల వాయిదాపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.

20 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్! 

ఇదిలా ఉంటే సుమారు 20 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇది 2025 సంవత్సరానికి సంబంధించి ఉంటుంది. ఇందులో పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, డీఎస్సీ, గ్రూప్-1, 2, 3, 4 నోటిఫికేషన్స్, వైద్యారోగ్యశాఖలోని పోస్టులకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనను సీఎంయే స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. క్యాలెండర్‌కు సంబంధించిన కసరత్తును ఇద్దరు ఐఏఎస్‌ల నేతృత్వంలో చేపడుతున్నట్లు తెలిసింది. నియామక ప్రక్రియనూ గతంలో మాదిరిగా కాకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నోటిఫికేషన్‌లో దరఖాస్తులు స్వీకరణ దగ్గరనుంచి పరీక్షల తేదీ, ఫలితాలు విడుదల, ఇంటర్యూలు ఎప్పుడు నిర్వహిస్తారో లాంటి పూర్తి వివరాలతో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించే వీలుంది.

కాంగ్రెస్ గెలుపుకు కీలక పాత్ర వహించాం

తాము నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రెండు బస్సుల్లో యాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కీలకపాత్ర పోషించామని నిరుద్యోగ చైతన్య యాత్ర కో మఠం శివానందస్వామి, ఇంద్రప్రసాద్‌నాయక్, సభ్యులు మహేశ్, ఈశ్వర్, యుగేందర్ తదితరులు గుర్తుచేశారు. తమతో సహా లక్షలాది మంది నిరు ద్యోగులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఏ పరీక్షకు సన్నద్ధం కావాలో సందిగ్ధంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని తెలిపారు. పోస్టులు పెం చుతామని అప్పుడు రేవంత్‌రెడ్డి హామీ ఇ చ్చారని, దీనిపై ఆయనే స్వయంగా కల్పించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై గురువారం చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీలో ఆందోళన చేపట్టారు.