calender_icon.png 15 March, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల

14-03-2025 09:03:41 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): టీజీపీఎస్సీ(TGPSC) దూకుడు పెంచింది. గ్రూప్స్ ఫలితాలను(Group Results) వెనువెంటనే విడుదల చేస్తోంది. తాజాగా గ్రూప్3 ఫలితాలను  విడుదల చేసింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ బీ వెంకటేశం(TGPSC Chairman B Venkatesham) శుక్రవారం గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. 450 మార్కులకుగానూ గ్రూప్3లో మొదటి ర్యాంకర్‌కు 339.239 మార్కులు వచ్చాయి. సెకండ్ ర్యాకర్‌కు 331.299 మార్కులు, మూడో ర్యాంకర్‌కు 330.427 మార్కులు వచ్చాయి. మహిళల్లో టాప్ ర్యాంకర్‌కు 325.157 మార్కులు వచ్చాయి. 92 ర్యాంక్ వరకు మహిళలు పది మందే ఉన్నారు. మొదటి 36 ర్యాంకుల్లో ఒకే ఒక మహిళా అభ్యర్థి ఉన్నారు. మొదటి 50 ర్యాంకుల్లో నలుగురు మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్-3 అభ్యర్థుల లాగిన్ ఐడీలతో లాగినై.. ఓఎంఆర్ షీట్లు చూసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది.

1388 పోస్టులకు గానూ గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమినరీ కీ ని విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,67,921 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 49.76 శాతం అభ్యర్థులు గైరాజరయ్యారు. వివిధ కారణాలతో తప్పులు చేయడంతో ఇన్‌వాలిడ్ (అర్హత కోల్పోయిన) అయిన అభ్యర్థులు 18,364 మంది ఉన్నారు. మొత్తంగా 2,49,557 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల తమ లాగిన్ ఐడీతో ఓఎంఆర్ షీట్లు, ఫైనల్ కీని చూసుకోవచ్చని తెలిపింది. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్- 1, గ్రూప్ -2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేయగా, తాజాగా గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసింది. అలాగే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను మార్చి 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నారు. ఇక మిగిలిన నోటిఫికేషన్లకు సంబంధించి త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు కమిషన్ తెలిపింది. ఫలితాలపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది.