27 వరకు యథాతథంగా మెయిన్స్
- గ్రేటర్ పరిధిలో 46 పరీక్ష కేంద్రాలు
- పరీక్షలు రాయనున్న 31,383 మంది
- 563 పోస్టుల భర్తీకి పరీక్షల నిర్వహణ
- పశ్రపత్ర వాహనాలకు తొలిసారి జీపీఎస్
- నిఘా నీడలో అన్ని పరీక్షా కేంద్రాలు
- మహిళలకు మంగళసూత్రం తప్ప ఆభరణాలు నిషిద్ధం
- టీజీపీఎస్సీ అధికారుల వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
563 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షలను పకడ్బంధీగా నిర్వహిం చేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అన్ని పరీక్షా కేంద్రాలు (46) ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్ జిల్లాలో 27 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్ష హాల్‌లో అభ్యర్థులందరి బయోమెట్రిక్‌ను నమోదు చేస్తారు. కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రం తరలించే వాహనాలకు తొలిసారి జీపీఎస్ ఏర్పాటుచేస్తున్నారు. మెయిన్స్ పరీక్ష వాయిదా కోసం ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరుగకుండా కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు.
అభ్యర్ధుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేం దుకు టీజీపీఎస్సీ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలలోపే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఆ తర్వాత అనుమతించబోమని అధికారులు తెలిపారు.
గ్రూప్-౧ పరీక్ష చివరిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నత స్థాయి ఉద్యోగులను ఎంపికచేసే ఈ పరీక్ష మెయిన్స్‌ను నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి.
కట్టుదిట్టమైన భద్రత
గ్రూప్ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్రంలో తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. రిజర్వేషన్లు, ప్రాథమిక పరీక్షలో తప్పులు తదితర అంశాలపై అభ్యర్థులు పోరాటం చేస్తున్నారు. కొందరు కోర్టుకు వెళ్లినప్పటికీ.. హైకోర్టు పరీక్ష నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మెయిన్స్‌ను యథాతథంగా నిర్వహిస్తున్నారు.
ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పశ్నపత్రాల తరలింపు, పరీక్ష నిర్వహణ, తిరిగి జవాబు పత్రాలు తీసుకెళ్లడం వరకు ఎలాంటి ఆటంకం లేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఒక ఎస్‌ఐతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంటారు.
అదనంగా ఒక పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్ పరీక్షా కేంద్రాలను తరచూ సందర్శిస్తుంది. స్థానిక సీఐ, ఏసీపీ పరీక్షా కేంద్రాల ను సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుంటారు. భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు మూడు కమిషనరేట్లలో ఒక్కో డీసీపీని నోడల్ అధికారిగా నియమించిన ట్లు పోలీసులు తెలిపారు.
ప్రశ్నపత్రాలు తరలించే వాహనాలకు టీజీపీఎస్సీ తొలిసారి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగిస్తోంది. స్ట్రాంగ్ రూముల నుంచి పరీక్ష కేంద్రానికి తరలించే వాహనాలకు జీపీఎస్ అమర్చి టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. వాహనం ఒక్కనిమిషం ఆగినా వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తారు.
గ్రూప్ పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్‌నెట్ దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. వాచీలు, కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ తదితర ఎలాంటి స్మార్ట్ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు. మహిళలకు మంగళసూత్రం, గాజులు మినహా ఆభరణాలకు అనుమతి లేదు.
చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది
ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుగా మారుతున్నది. చిన్న తప్పు జరిగినా క్షణాల్లో అది దావానంలా ప్రజల్లోకి వెళ్లిపోతుంది. అందుకే ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
పరీక్షల నిర్వహణలో ప్రతి దశలోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట సమాయాన్ని అదనంగా కేటాయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రుబ్ ) అవసరం ఉన్నవారి హాల్ టికెట్లపై ఆ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
వారికి స్క్రుబ్‌ల సహాయంతో పరీక్షలు రాసేందుకు ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నిపరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నిరంతరం విద్యుత్ సరఫరా అందించేలా ఎస్పీడీసీఎల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. కాగా ఆదివారం నాటికి 90 శాతం అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.