వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలని, నిరుద్యోగుల ఆందోళన పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ నాయకులు పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నారని, ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేశారని, ఈ పరీక్ష రాసేవారిలో గ్రూప్ 2, 3 అభ్యర్థులు కూడా ఉన్నట్టు ఆదివారం ఆయా విద్యార్థి సంఘాల నాయకులు ఆర్‌ఎల్ మూర్తి, తాళ్ల నాగరాజు, కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్ ఒక ప్రకటనలో గుర్తుచేశారు. గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో ఉండటంతో డీఎస్సీ రాసేవారికి సమయం సరిపోదని తెలిపారు.
దీంతో నిరుద్యోగులు గ్రూప్ 3లను కనీసం నెల రోజులు వాయిదా వేయాలని కోరుతున్నట్టు చెప్పారు. వారి డిమాండ్లు కూడా సరైనవేనని, గతంలో పేపర్ లీకేజీలు, టీజీపీఎస్సీ తప్పిదాలతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. డీఎస్సీ, గ్రూప్ సిలబస్ వేర్వేరుగా ఉంటుందని, ఈ సున్నితమైన అంశంపై అభ్యర్థులతో చర్చించి పరిష్కారం చూపాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించాలని పోరాడుతున్న నిరుద్యోగులను అరెస్టు చేసి కేసులు పెట్టడం, నిర్బంధించడం మానుకోవాలని హితువుపలికారు. ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించి, అరెస్టు చేసిన నిరుద్యోగులను విడుదల చేసి, పరీక్షలను నెల రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.