- సెక్రటేరియట్ ముట్టడికి బీసీ జనసభ యత్నం
- సంఘం అధ్యక్షుడు రాజారాంయాదవ్ సహా పలువురి అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఇచ్చిన చలో సెక్రటేరియట్ పిలుపు నేపథ్యంలో సోమవారం సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెక్రటేరియట్ చుట్టూ, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీసులను ఛేదించుకుని మింట్ కాంపౌండ్ వైపు నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్లేందుకు బీసీ జనసభ నాయకులు యత్నించారు.
అప్రమత్తమైన పోలీసులు బీసీ జనసభ అధ్యక్షుడు డీ రాజారాంయాదవ్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా రాజారాంయాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు పెట్టినా నిరుద్యోగుల పక్షాన పోరాడుతామని స్పష్టంచేశారు. గ్రూప్ 2, 3, డీఎస్సీ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని, ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి మొండిగా వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారు.
నిరుద్యోగులతో పెట్టుకున్న రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమైందని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దిగిరాకపోతే రాహుల్ చెప్పేవన్నీ అబద్ధాలేనని జాతీయస్థాయిలో ప్రచారం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు రాజారాంయాదవ్‌ను ఫలక్‌నామా పోలీస్‌స్టేషన్‌కు, కార్యకర్తలను షాఇనాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య అధ్యక్షుడు కొంపెల్లి రాజు, టీఎస్పీ అధ్యక్షడు బీ అశోక్‌యాదవ్, టీఎస్పీ కోఆర్డినేటర్ సూర్యప్రకాశ్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగం, నాయకులు జక్కుల మధు, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కే జంగయ్య, మేకల కృష్ణ, మామిడి పద్మ, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలనలో శాంతియుత ఆందోళనలు నిషేధమా: కేటీఆర్
నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, శాంతియుత ఆందోళనలు చేయడం కూడా ప్రజాపాలనలో నిషేధమా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌క కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన రాజారాంయాదవ్ సహా విద్యార్థి నాయకుల అరెస్ట్‌ను ఆయన ఖండించారు. సమస్యలను సానుకూల దృక్పథంతో నెరవేర్చాల్సిన ప్రభుత్వం.. నిర్భందంగా అరెస్టులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టులు అప్రజాస్వామికం: ఎంపీ ఆర్ కృష్ణయ్య
సెక్రటేరియట్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజారాంయాదవ్ సహా ఎవరికి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.