calender_icon.png 24 December, 2024 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందే

19-10-2024 01:52:01 AM

  1. అభ్యర్థుల ఆందోళనతో రేవంత్ సర్కార్ మనుగడ ప్రమాదకరం
  2. గొడవ పెద్దది కావాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు
  3. సీఎం సీటు కోసం గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నారు
  4. గ్రూప్ అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు
  5. మూసీ పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీకి మేం వ్యతిరేకం
  6. 11 వేల ఇండ్లను కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోం
  7. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి):  కాంగ్రెస్ ప్రభుత్వం 29 జీవోను ఉపసంహరించుకుని గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనతో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదముందని  హెచ్చరించారు.

శుక్రవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళన పూర్తిగా న్యాయమైందని, వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే 29 జీవోను ఉపసంహరించుకోవాలని, పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని అన్నారు.

లేనిపక్షంలో కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు  అశోక్‌నగర్‌కు వెళ్లి నిరుద్యోగుల ఆందోళనకు మద్దతిస్తానని తెలిపారు. అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జి దుర్మార్గమని, కాంగ్రెస్ ప్రభుత్వం  రాక్షసంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగుల పొట్టకొట్టడానికే 29 జీవో జారీ చేశారని చెప్పారు. బీఆర్‌ఎస్ సర్కార్‌కు, కాంగ్రెస్ పాలనకు ఏం తేడాలేదని విమర్శించారు.

హామీలిచ్చుడు, మోసాలు చేయడంలో రెండు పార్టీలు నెంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడి పదేండ్లయినా గ్రూప్-1 పోస్లును భర్తీ చేయనేలేదని, కేసీఆర్ ఆలోచనా విధానానికి అనుగుణంగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు. నిరుద్యోగుల బ్రాండ్ అంబాసిడర్‌లాగా కేటీఆర్ ఫోజు కొట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. 

 రేవంత్‌రెడ్డి గజినీలా వ్యవహరిస్తున్నారు..

మూసీపై సీఎం రేవంత్ రెడ్డి రోజుకోమాట మారుస్తూ గజినీలా మారుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని చెప్పంది రేవంత్ రెడ్డేనని, మూసీ ప్రక్షాళనకు ప్రపంచబ్యాంకు నుంచి అప్పుకోసం సాగిలపడుతోంది కాంగ్రెస్సేనని ఆరోపించారు.  మూసీ పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీకి బీజేపీ వ్యతిరేకమని, మూసీ పేరుతో 11 వేల ఇండ్లను కూల్చడానికి వ్యతిరేకమన్నారు.

బాధితులకు ఇండ్లు కేటాయించి ఆదుకున్న తరువాతే మూసీ ప్రక్షాళనకు పూనుకోవాలన్నారు. హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చేస్తామంటూ చూస్తూ ఊరుకునేది ప్రసక్తే లేదన్నారు. అక్రమ లే అవుట్ల పేరుతో హైడ్రా సర్వే నెంబర్లను రిలీజ్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ లే అవుట్లను రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను, బాధ్యలను జైలుకు పంపాలన్నారు.

హైడ్రా నడవాలే, మూసీ ప్రక్షాళన గొడవ కావాలే, గ్రూప్-1 గొడవ పెద్దది కావాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు సీఎం సీటు కోసం గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూసీపై కేటీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఒక జోక్ అని, మూసీపై కేసీఆర్ ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్ నేతలు మర్చిపోయినట్లున్నారని అన్నారు.