కామారెడ్డి,(విజయక్రాంతి): గ్రూప్-3 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు చివరి సమయంలో హడావిడి చేశారు. అధికారులు ముందుగానే తెలిపిన అభ్యర్థులు మాత్రం చివరి సమయం వరకు వచ్చారు. నిమిషం లేటు వచ్చిన అనుమతి లేకపోవడంతో మరికొందరికి చుక్కెదురైంది. కామారెడ్డి సరస్వతి శిశు మందిర్ పరీక్ష కేంద్రం వద్దకు లింగంపేటకు చెందిన సంజీవ్ పరీక్ష కోసం ముందుగానే హాజరయ్యారు. గుర్తింపు కార్డు లేకపోవడంతో జిరాక్స్ కోసం వెళ్ళాడు. వచ్చేసరికి రెండు నిమిషాలు అలస్యమవడంతో అధికారులు అనుమతించలేదు.
తాను ముందుగానే వచ్చానని జిరాక్స్ కోసం వెళ్లాలని ఎంత ప్రాధేయపడ్డ అధికారులు అనుమతించలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్ వద్ద గాంధారి మండలంలోని పద్మా గంగాధర్ మూడు నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి హాజరుకాగా అధికారుల అనుమతించలేదు. కొందరు పరీక్ష చివరి సమయం వరకు హడావిడిగా వచ్చినా అభ్యర్థులు అమ్మయ్య అంటూ వచ్చి ఎట్టకేలకు పరీక్ష కేంద్రానికి చేరారు. మరికొందరు షూతో వస్తే వారిని అనుమతించలేదు.
మరికొందరు అభ్యర్థులు పరీక్ష సమయం కంటే గంట ముందుగానే వచ్చి నిరీక్షించారు. మరి కొందరు చిన్న పిల్లలు ఉన్న తల్లులు వారి కుటుంబసభ్యులను వెంటపెట్టుకొని వచ్చి పరీక్ష కేంద్రం బయట ఉంచి పరీక్ష రాసేందుకు వెళ్లారు. పోలీస్ బందోబస్తును నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, కామారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. 20 పరీక్ష కేంద్రాలలో 8268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.