calender_icon.png 22 October, 2024 | 5:35 AM

కాంగ్రెస్‌కు తలనొప్పిగా గ్రూప్-1 వివాదం!

22-10-2024 01:25:51 AM

  1. జీవో 29పై సొంత పార్టీలోనే అసంతృప్తి 
  2. నష్ట నివారణ చర్యలకు దిగిన పీసీసీ చీఫ్ 
  3. ఎవరికి అన్యాయం జరగదని అభ్యర్థులకు భరోసా 
  4.  స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇదేం గోల?  
  5. ఉద్యోగాలిచ్చి బద్నాం అవుతున్నామంటున్న నాయకులు 

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వం ఏదైనా గ్రూప్-1 పరీక్షల నిర్వహణ  వివాదాల చుట్టే తిరుగుతున్నాయి. గత బీఆర్‌ఎస్ సర్కార్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే వివాదం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక దాదాపుగా 50 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేశామని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. గూప్-1 పరీక్షల వివాదం తలనొప్పిగా మారిందనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది.

సుప్రీంకోర్టు తీర్పుతో గ్రూప్-1 పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపినప్పటికీ.. పార్టీలోని కొందరు నాయకుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. గ్రూప్-1 పోస్టుల భర్తీ విషయలో సర్కార్ తీసుకొచ్చిన జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు సొంత పార్టీలోని కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మాల్లన్న మాత్రం సర్కార్‌పై బహటంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగంలో దిగి రిజర్వుడు కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని చెబుతున్నారు.

అంతేకాకుండా గ్రూప్-1 పరీక్షలకు రెండు రోజుల ముందు మంత్రులతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇచ్చినా పార్టీ నాయకుల్లో మాత్రం గందరగోళం నెలకొన్నది. అయితే జీవో 29 వల్ల రిజర్వుడు వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రజల్లో బలంగా వెళ్లిందనే వాదన వినిపిస్తోంది.

పీసీసీ చీఫ్ నష్టనివారణ చర్యలు..

 స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ఒక వైపు చెబుతోందని, మరోవైపు గ్రూప్- 1 పరీక్షలకు సంబంధించి జీవో 29 వివాదం కొనసాగుతుండటంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనేది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిం ది.

ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక అడుగు ముందుకేసి నష్టనివారణ చర్యలు చేపట్టే ప్రయత్నం చేసినా ఐదా రు రోజులు ముందుగానే స్పందిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరీక్షల నిర్హహణలో ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడం కంటే.. అభ్యర్థులను చర్చలకు పిలిచి ఉంటే బాగుండేదని పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా బద్నామైతే.. ఇప్పుడు ఉద్యోగాలను భర్తీ చేసి కూడా ప్రతిపక్షాల తీరుతో ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆ సీనియర్ నాయకుడు వాపోయారు.