calender_icon.png 17 October, 2024 | 6:02 AM

తీర్పునకు లోబడి గ్రూప్-1 నియామకాలు

17-10-2024 03:41:05 AM

  1. పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరణ
  2. దివ్యాంగుల రిజర్వేషన్ కోటా వివాదంలో మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి): దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబం ధించిన వివాదంలో గ్రూప్1 పరీక్షల వాయి దా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఆ నియామకాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉండాలని మధ్యంతర ఆదేశాలను జారీచేసింది. 

ఈ నెల 21 నుంచి పరీక్షలు జరగున్నాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయబోమని స్పష్టంచేసింది.  పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది.

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022 నాటి జీవో 55కు సవరణ తీసుకువస్తూ ఈ ఏడా ది ఫిబ్రవరి 8న  జీవో 29 జారీ చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన డివిజన్ బెంచ్  బుధవారం విచారించింది.

పిటిషనర్ల లాయర్లు వాదిస్తూ.. జనరల్ క్యాటగిరీ లోని అభ్యర్థులకంటే ఎక్కువ మార్కులు సాధించినవారిని అన్ రిజర్వుడుగానే పరిగణించడం వల్ల దివ్యాంగులకు అన్యాయం జరుగుతోందన్నారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ రిజర్వేషన్ క్యాటగిరీ కిందనే పరిగణించి 150 కింద అభ్యర్థు లను మెయిన్స్‌కు పిలవాలన్నారు.

జీవో 55ను సవాల్ చేసిన వ్యాజ్యాలు విచారణలోనే ఉన్నాయని, దానికి సవరణ జీవో తేవ డం చెల్లదన్నారు. దీనికితోడు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా 62 శాతానికి చేరడం చట్ట వ్యతిరేకమన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. అవి కార్యనిర్వాహక ఉత్తర్వులు మాత్రమేనని చెప్పారు. 

దివ్యాంగుల చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం నిబంధనలు తీసుకువచ్చామని, జీవో రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు. ఈ నెల 21న రెండు పరీక్షలు ప్రారంభం అవుతాయన్నా రు. మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని టీజీపీఎస్సీ లాయర్ చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. స్టే ఇచ్చేందుకు, పరీక్షలను వాయి దా వేసేందుకు నిరాకరించింది.