- రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్, బీజేపీ నేతలు విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి
- కోహీర్ మండలం గోటిగార్‌పల్లిలో వాటర్‌షెడ్ పనుల పరిశీలన
సంగారెడ్డి, జనవరి 29 (విజయక్రాంతి): వర్షపు నీరు నిల్వ చేసేందుకు చెక్‌డ్యాంలు, ఊట చెరువులు ఎంతో మేలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ నేతలు విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కోహీర్ మండలంలోని గోటిగార్‌పల్లిలో నిర్మించిన వాటర్‌షెడ్‌లను పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడారు.
ప్రతీవర్షపు నీటి చుక్క భూగర్భంలో ఇంకితే నీటి సమస్య ఉండదన్నారు. గతంలో ప్రభుత్వం గోటిగార్‌పల్లి గ్రామంలో వాటర్ షెడ్ పనులు చేయడంతో గ్రామంలో నీటి సమస్య లేదన్నారు. గ్రామంలో భూగర్భ జలాలు పెరిగిపోవడంతో వ్యవసాయ పంటలు పుష్కలంగా పండుతున్నాయని తెలిపారు.
రైతులు వాణిజ్య పంటలు పండించి అందరికి అదర్శంగా నిలించారన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఇంకుడు గుంతలు తవ్వకాలు చేసుకోవాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరిగిన తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు ఉన్నారు.