calender_icon.png 12 March, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగంటుతున్న భూగర్భ జలాలు

12-03-2025 12:31:52 AM

నెల వ్యవధిలోనే మీటరు లోతుకు పడిపోయిన జలాలు

కరీంనగర్, మార్చి 11 (విజయబ్రాంతి): జిల్లాలో భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండడంతో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, చిగురుమామిడి ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటున్నాయి. నెల వ్యవధిలోనే సుమారు మీటరు లోతుకు భూగర్భ జలాలు అడుగంటడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.

పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయంగా బోర్లు వేస్తున్నారు. జిల్లాలోని గంగాధర మండలంలో జనవరిలో 12.75 మీటర్ల లోతున నీరు లభించగా, ప్రస్తుతం 14.34 మీటర్ల తోతుకు జలాలు పడిపోయాయి. చొప్పదండి మండలంలో జనవరిలో 11.12 మీటర్ల లోతు ఉన్న నీరు 12.24 మీటర్లకు పడిపోయింది.

రామడుగులో 9.144 మీటర్ల నుంచి 10.62 మీటర్ల లోతుకు పడిపోయాయి, కరీంనగర్లో 8.51 మీటర్ల నుంచి 9.75 మీటర్లకు, కొత్తపల్లిలో 8.15 నుంచి 9 మీటర్ల వరకు, గన్నేరువరంలో 8,42 మీటర్ల నుంచి 8.72 మీటర్ల లోతుకు, తిమ్మాపూర్ 6.8 నుంచి 8.06 మీటర్ల లోతుకు నీరు పడిపోయింది. జిల్లాలో సగటున 0.60 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.

జిల్లాలో ఈ రబీ సీజన్లో 2 లక్షల 64 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో 50 వేల ఎఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. ఈ పంటలు చివరి దశకు రాగా భూగర్భజలాలు తగ్గిపోతుండడంతో సాగు నీటికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. మార్చిలోనే 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అటు నీటి సమస్య, ఇటు వేడి సమస్యతో రైతులు పంటలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీరందించేందు ప్రత్యేక చర్యలు.

వేసవిలో గ్రామాల్లో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు కలగకుండా సగ్రమంగా నీటిని అందించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పైపులైన్లు లీకేజీలు అవుతున్నాయి. వాటిని ప్రస్తుతం అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాడు.

ప్రతిరోజు పైపులైన్ల పరిస్థితిని పంచాయతీ అధికారులు పరిశీలిస్తున్నారు. వేసవిలో ప్రధానంగా గ్రామాల్లోని ప్రజలు బోర్లపై ఆధారపడతారు. చిగురుమామిడి మండలంలో 17 గ్రామాల్లో 147 చేతి పంపులు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 42 చేతి పంపులకు రిపేర్లు చేపట్టనున్నారు. బొమ్మనపల్లి, సుందరగిరి, చిగురుమామిడి గ్రామాలోల 15 వరకు చేతిపంపులను రిపేర్ చేశారు. ఇంకా పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయాల్సి ఉంది.