26-04-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 25 ( విజయక్రాంతి) వ్యవసాయ భూముల్లో ఫామ్ పౌండ్స్ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల అభివృద్ధితోపాటు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం చంద్రుగొండ పర్యటనలో భాగంగా స్థానికంగా ఉపాధి హామీ పథకం లో రైతు చేపల మడుగు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో 20/20 విస్తీర్ణంలో సుమారు రూ 2 25 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఫామ్ పాండ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఈ ఫామ్ పౌండ్ ని ర్మాణాలు కచ్చితంగా చేపట్టాలని దీని ద్వారా భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ ఫామ్ పాండ్ లద్వారా చేపల పెంపకం చేపట్టి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం పరుచుకోవాలని కలెక్టర్ సూచించారు.
రైతులు ఒక్క పంట పైనే ఆధారపడకుండా అంతర పంటగా చేపల పెంపకం, మునగ, అజోల్ల వంటివి సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని అన్నారు. చాపల మడుగు నాగేంద్రబాబు అనే రైతు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక ఎకరంలో సాగు చేస్తున్న మునగ తోటను ఆయన పరిశీలించారు.కలెక్టర్ వెంట చండ్రుగొండ తాసిల్దార్ సంధ్యా రాణి, ఎంపీడీవో అశోక్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు