వరుసగా రెండు రోజులు బంద్ కావడంతో ఒక్కసారిగా వచ్చిన పల్లి
కష్టమో నష్టమో అమ్మాలంటున్న రైతన్న
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మార్కెట్ యార్డులో పట్టనంత పల్లి వచ్చేసింది. గడిచిన మంగళవారం రైతులు పల్లి ధరలు పెంచాలని ఆందోళన చేయడంతో అప్పటికే టెండర్ అయిన పల్లికి క్వింటాలుకు రూ.200 పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి ప్రకటించిన విషయం విజితమే. ఈ క్రమంలో బుధవారం అమావాస్య, గురువారం మార్కెట్ యార్డ్ లో ఉన్న పల్లిని లిఫ్ట్ చేసినందుకు సెలవు ప్రకటించడం ఇలా వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో శుక్రవారం ఒక్కసారిగా పల్లి మార్కెట్ యార్డ్ కు వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి పల్లి రైతులు మార్కెట్ యార్డులో స్థలం దొరకదనే సందేహంతో మార్కెట్ యార్డ్ కు విచ్చేశారు. శుక్రవారం దాదాపు 35 వేల బ్యాగుల పల్లి మార్కెట్ యార్డ్ కు వివిధ వాహనాల ద్వారా పల్లి విచ్చేసింది. దీంతో మార్కెట్ యార్డులో ఎక్కడ పోయేలేని పరిస్థితి నెలకొంది. కమిషన్ ఏజెంట్లు వచ్చిన పల్లిని ఎక్కడైనా పోసి విక్రయించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్ యార్డ్ లోని అంతర్గత రోడ్లపై కూడా పల్లిని పోసే పరిస్థితి నెలకొన్నది.
పాలమూరు మార్కెట్ యార్డ్ పై రైతు మొగ్గు
కేవలం మహబూబ్ నగర్ చుట్టుపక్కల గ్రామాలనుంచే కాదు వికారాబాద్, నారాయణపేట జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా రైతులు మహబూబ్ నగర్ మార్కెట్ యార్డులో పల్లి విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ మంచి ధర పల్లికి వస్తుందనే ఆశాభావం రైతుల్లో ఉంది. దీంతో నానాటి నుంచి మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ లోనే ప్రధానంగా పలిని విక్రయించాలని రైతులు ఎంతో ఆశతో మార్కెట్ యార్డ్ కు వచ్చేస్తున్నారు. స్థలం ఉందా లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎలాగోలాగో అమ్ముకొని పోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.