calender_icon.png 20 September, 2024 | 5:30 AM

అక్రమ నిర్మాణం నేలమట్టం

20-09-2024 12:40:26 AM

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ప్రభుత్వ భూమిలో జీ+౩ భవనం  

అధికారుల నోటీసులు 

పట్టించుకోకపోవడంతో రంగంలోకి యంత్రాంగం 

పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత

మంచిర్యాల, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. హైదరాబాద్‌లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించిన హైడ్రా తరహాలో మంచిర్యాల జిల్లాలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు.

ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 42లో అక్రమ నిర్మాణాల కూల్చివేతను గురువారం షురూ చేశారు. అక్రమ నిర్మాణదారులకు ముందుగానే నోటీసులు జారీచేసి ప్రణాళికబద్ధంగా కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సతీష్ దగ్గరుండి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు భారీ యంత్రాల సహాయంతో భవనాన్ని నేలమట్టం చేశారు. 

ముందుగానే నోటీసులు  

టీబీజీకేఎస్ మాజీ నాయకుడు ఢీకొండ అన్నయ్య సర్వే నంబర్ 40లో ప్లాటు కొనుగోలు చేశాడు. అమ్మిన వ్యక్తి ప్రభుత్వ భూమిలో (సర్వే నెంబర్ 42లో) ప్లాటును చూపించడంతో అక్కడే నిర్మాణం చేపట్టాడు. ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరుపుతున్నారంటూ 2022లోనే మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. అమ్మిన వ్యక్తి సంబంధిత అధికారు లను మేనేజ్ చేయడంతో జీ ప్లస్3 భవన నిర్మాణం చేశారు. నిర్మాణ సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ‘మామూలు’గా కూర్చున్న అధికారులు.. ప్రస్తుతం కొరఢా ఝులిపించారు. 15 రోజుల ముం దుగానే నోటీసులు అందజేసి ఒక్కసారి కూల్చివేతకు పూనుకున్నారు. 

జిల్లాలోనే మొదటి కూల్చివేత 

ఉమ్మడి జిల్లాలో.. మంచిర్యాల జిల్లా ఏర్పడిన తరువాతా అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగలేదు. అక్రమంగా నిర్మాణం జరిపారంటూ సుమారు రూ.౨ కోట్ల విలువైన భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడం ఇదే ప్రథమం. ఈ భవనం కూల్చివేయడంతో అక్రమంగా నిర్మాణాలు చేసుకున్న చాలామంది భయాందోళన చెందుతున్నారు. మరోవైపు భవన నిర్మాణ సమయంలో లక్షల రూపాయలు తీసుకొని ఊరుకున్న అధికారులు కట్టుకున్న తర్వాత కూల్చివేయడం సబబు కాదని చచ్చించుకుంటున్నారు. నిర్మాణ సమయంలో చూస్తు ఊరుకున్న అధికారులను సైతం శిక్షించాలని, వారిని ఉద్యోగం నుంచి సస్సెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బీఆర్‌ఎస్ లీడర్లే టార్గెట్?

బీఆర్‌ఎస్ లీడర్లే టార్గెట్‌గా గురువారం అధికారులు వ్యవహరించారు. ఉదయమే బీఆర్‌ఎస్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఇంటి ముందు గల సీసీ రోడ్డును తొలగించిన మున్సిపల్ అధికారులు.. టీబీజీకేఎస్ మాజీ లీడర్ ఢీకొండ అన్నయ్య ఇంటిని కూలగొట్టారు. ఇదంతా కావాలనే జరిగిందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. బీఆర్‌ఎస్ లీడర్లే టార్గెట్ చేసి కాంగ్రెస్ నాయకులు కూల్చివేతలు చేస్తున్నారని, అక్రమ నిర్మాణాలలో కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది ఉన్నా.. వారి జోలికి పోకుండా కేవలం బీఆర్‌ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి.