న్యూఢిల్లీ, జూన్ 21: గ్రాసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో తాజా ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ లో వివిధ ఇన్వెస్టర్ల నుంచి 665 మిలియన్ డాలర్లు సమీకరించింది. కంపెనీకి 3.6 బిలియన్ డాలర్ల విలువకట్టి, తాజా నిధుల్ని ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్టు జెప్టో శుక్రవారం వెల్లడించింది. తమ ఏడాది క్రితం విలువతో పోలిస్తే తాజా గా మూడు రెట్లు పెరిగిందని, త్వరలో ఐపీవో జారీచేసి, ముంబై స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టింగ్‌కు యోచిస్తున్నట్టు తెలి పింది. తాజా నిధుల సమీకరణతో జెప్టో గ్రాసరీ డెలివరీ విభాగంలో దిగ్గజాలైన అమెజాన్, జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్, టాటా గ్రూప్ బిగ్ బాస్కెట్‌లతో పోటీపడే వీలు కలుగుతుంది. న్యూయార్క్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అవెనిర్ గ్రోత్ క్యాపిటల్, వెంచర్ ఫండ్ సంస్థ లైట్‌స్పీడ్‌లతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లయిన గ్లేడ్ బ్రూక్, నెక్సెస్, స్టెప్‌స్టోన్ గ్రూప్‌లు తాజా ఫండింగ్ రౌండ్‌లో పాలుపంచుకున్నాయి.