calender_icon.png 22 January, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలనపై పట్టు.. మార్పునకు తొలిమెట్టు

05-07-2024 12:28:19 AM

ఈ-ఆఫీస్ విధానంతో సత్వర న్యాయం

క్షేత్రస్థాయి పర్యటనలతో సమస్యల పరిష్కారం

జాబ్ చార్ట్‌తో అధికారుల పనితీరు పరిశీలన

పాలనలో మార్క్ చూపిన్తున్న మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూలై 4 (విజయక్రాంతి): జిల్లా పాలనాధికారి అంటే అధికారులను ఉరుకు లు, పరుగులు పెట్టించడమే కాదు  వారిలో ఆత్మస్థుర్యైన్ని నింపి పాలనలో భాగస్వాములను చేయడం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా తయారు చేయడం. అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాదు, తాను స్వయంగా క్షేత్ర పర్యటన చేసి కిందిస్థాయి సిబ్బందికి విధి నిర్వహణ గుర్తు చేయడం. ఇవన్నీ ఆచరిస్తూ అధికారులు కూడా ఆచరించేలా కృషి చేస్తున్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. తాజాగా మెదక్ కలెక్టరేట్‌లో ఈఆఫీస్ ప్రారంభించి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రజలకు చేరువగా..

జిల్లాలో సమర్థవంతమైన పాలన అం దించడమే కాకుండా, ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా సకాలంలో అందించేలా శ్రీకారం చుట్టారు కలెక్టర్ రాహుల్ రాజ్. అందులో భాగంగానే జిల్లాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. గత బుధవారం ఈఆఫీస్ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా ప్రారంభించారు. సుమారు 17 శాఖలను అనుసంధానం చేస్తూ ఈ కార్యకలాపాలు జరుగుతాయి. ప్రతి ఫైల్ కూడా స్కాన్ చేసి భద్రపర్చడమే కాకుండా నూతన ఫైల్స్ కూడా అన్ని శాఖల్లో సర్క్యులేట్ చేస్తారు. ఇక నుంచి ప్రతి ఫైలు మాన్యువల్‌గా స్వీకరించడం కాకుండా ఈ ద్వారా రావాల్సి ఉంటుంది. సంబంధిత శాఖల అధికారుల డిజిటల్ సంతకంతో పాటు కలెక్టర్ సంతకం ఉండనుండగా, క్షణాల వ్యవధిలో సమస్య పరిష్కరించడం జరుగుతుంది. ఏ అధికారి బదిలీపై వచ్చినా ఆ శాఖకు సంబంధించిన ఫైల్స్ ఈఆఫీస్‌లో చూసుకుంటే పరిపాలన సులభతరం అవుతుంది. 

పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం..

మెదక్ కలెక్టరేట్‌ను ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా మార్చేందుకు కలెక్టర్ పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందుకుగాను వాటర్ బాటిల్స్ ద్వారా నీటి సరఫరా చేయకుండా కలెక్టరేట్‌లోనే ప్రత్యేక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రతీ కార్యాలయంలో స్టీల్ గ్లాసులు, వాటర్ బాటిళ్లు ఉంచుకోవాలని, వాటి ద్వారా వాటర్ ప్లాంట్ నుంచి నీటిని వాడుకోవాలని సూచించారు. 

సమర్థవంతమైన పాలనకు అడుగులు.. 

అధికారులు క్షేత్రస్థాయిలో వారివారి శాఖల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి చిత్తశుద్ధితో పనిచేసేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు గాను క్షేత్రస్థాయి అధికారులకు సమయపాలన తప్పనిసరి చేశారు. క్షేత్రస్థాయి పర్యటన అధికారులు టూర్ డైరీ తప్పనిసరిగా మెయింటెన్ చేసేలా కార్యాచరణ రూపొందించారు. స్వయంగా కలెక్టర్  క్షేత్రస్థాయి పర్యటనలోనే ఉండి సంబంధిత అధికారులు విధుల పట్ల అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్క క్షేత్రస్థాయి అధికారి జాబ్ చార్ట్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.