calender_icon.png 1 November, 2024 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోలార్ యూనిట్లపై గృహజ్యోతి ఎఫెక్ట్

11-08-2024 07:10:47 AM

  1. సబ్సిడీ ఇస్తామన్నా ముందుకు రాని మహిళలు 
  2. మెదక్ జిల్లావ్యాప్తంగా రెండే యూనిట్లు ఏర్పాటు 
  3. ఈ ఏడాది 300 యూనిట్ల లక్ష్యం 

మెదక్, ఆగస్టు 10 (విజయక్రాంతి): తరిగిపోతున్న వనరులను కాపాడుకో వడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, విద్యుత్తు ఖర్చుల భారం తగ్గించేందుకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు సబ్సిడీతో కూడిన సోలార్ (సౌర) విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు గతేడాది ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముందుగా ఆదర్శ గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులను చైతన్యం చేసి సౌర యూనిట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించింది.

ఇందులో భాగంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటను పైలట్ ప్రాజెక్ట్ గ్రామంగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. సుమారు 160 నుంచి 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్లాబు కలిగి ఉంటే 2 నుంచి 3 కిలోవాట్(కేవీ)ల సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకొని తమ ఇంటి అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.

కేంద్రం సబ్సిడీ..

సోలార్ యూనిట్ల ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాలతో పాటు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందజేస్తోంది. ఈ రుణాలన్ని స్త్రీనిధి నియమ, నిబంధనల మేరకు ఉంటాయి. వడ్డీ 11 శాతంతో 60 నెలల్లో చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా లింగారెడ్డిపేటలో రెండు యూనిట్లను ఏర్పాటు చేశారు.

గృహజ్యోతితో దెబ్బ.. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందజేస్తుండడంతో సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అసలు ఈ పథకంపై అధికారులు కూడా దృష్టి పెట్టడం లేదు. ఇక గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులను ప్రశ్నిస్తే ఉచితంగా కరెంట్ ఇస్తుంటే ఇంకా సోలార్ యూనిట్లను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.

ఈ ఏడాది లక్ష్యం నెరవేరేనా?

మెదక్ జిల్లాలో గత ప్రభుత్వ హయాం లో కేవలం రెండు యూనిట్లను మాత్రమే ఏర్పా టు చేయగలిగారు. ఈ సంవత్సరం జిల్లాలో 300 యూనిట్ల లక్ష్యం పెట్టుకున్న ట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, కొత్త ప్రభుత్వం గృహజ్యోతి పథకం తీసుకురావడంతో మహి ళా సంఘాలు సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. దీనికితోడు సోలా ర్ యూని ట్ల ఏర్పాటుతో కలిగే లాభాలపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు సైతం ఉన్నా యి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లక్ష్యం మేరకు యూనిట్లను ఏర్పాటు చేస్తారా అనేది అనుమానంగానే ఉంది. 


ఆసక్తి చూపడం లేదు

సోలార్ యూని ట్ల ఏర్పాట్లపై మహిళలు అంతగా ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో పైలట్ ప్రా జెక్ట్ కింద మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో రెండు యూనిట్లను గత ప్రభుత్వంలో మంజూరు చేశాం. ఇంకా యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఏడాది 300 యూనిట్ల లక్ష్యంగా పెట్టుకున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ వల్ల సోలార్ యూనిట్ల ఏర్పాటుపై మహిళా సంఘాలు ముందుకు రావడం లేదు. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. సబ్సిడీ పెంపుపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 

 గంగారాం, స్త్రీనిధి రీజినల్ మేనేజర్, మెదక్