calender_icon.png 22 November, 2024 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందనమమ్మా వనదేవతా!

22-11-2024 12:00:00 AM

కార్తీకమాసం మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ క్రమంలోనే వన భోజనాలు ఊపందుకున్నాయి. ఈ నెలంతా శివకేశవుల ప్రత్యేక ఆరాధనకు అత్యంత పుణ్యప్రదమైన కాలమని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యేక దీపారాధనల నుంచి గోసేవ, తులసిపూజ, ఉసిరికాయల దానాలు, శ్రీకేదారేశ్వర నోములు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, వన సమారాధనలు, వన భోజనాలు వంటివాటికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. 
ఈ మాసం ముగిసేలోగా ఏదో ఒకరోజు చాలామంది చిన్నదో పెద్దదో, తోట ల్లోకి వెళ్లి ఉసిరిచెట్టుకు పూజలు చేసి, భోజనాలు చేసి రావడం పరిపాటిగా మారింది. అసలు, వన సమారాధన, భోజనాల అంతరార్థం ఏమిటి? ఎందుకు వనాలు లేదా తోటలకు వెళ్లడం? ఈ విషయాలు తెలుసుకొని చేయడం వల్ల మరింత మానసిక ప్రశాంతతకు అవకాశం కలుగుతుంది. నైమిశారణ్యంలో సూత మహాముని తోటి మును లందరితో కలిసి ఇలా వన సమారాధన అనంతరం, భోజనం చేసినట్టు పురాణాల్లో వుంది.
అలాగే, శ్రీ కృష్ణుడు కూడా తోటి నందగోప బాలురతో కలిసి వనభోజనం చేశాడనీ అంటారు. ప్రత్యేకించి ధాత్రి వృక్షం (ఉసిరి చెట్టు) కింద శివకేశవుల చిత్రపటాలను వుంచి, షోడశోపచార పూజ చేయాలని వేదపండితులు చెప్తున్నారు. హైందవులు వనాలను సైతం దేవతా స్వరూపంగా భావిస్తారు. ప్రశాంతత కోస మూ పూర్వకాలంలో అడవులలోనే ఎక్కువ గా తపస్సు చేసుకొనే వారు. వనాలు అంటేనే అనేక వృక్షాల సముదాయం. పచ్చదనం ఎక్కడ వుంటే ప్రకృతి అక్కడ ఉన్నట్టే.
నిజానికి పూర్తి స్థాయి వనాలు ఇప్పుడు చాలా అరుదు. ఉన్నా మనకు అవి అందుబాటులో ఉండవు. అటువంటి అడవుల్లో మామిడి, వేప, రావి, మర్రి, మారేడు, మద్ది, ఉసిరి, నేరేడు, పనస, మోదుగ, జమ్మి వంటివాటితోపాటు తులసి, అరటి, జామ, కొబ్బ రి, నిమ్మ వంటి చెట్లతో కూడిన వన ప్రదేశాలు వన సమారాధనకు అత్యంత అనుకూ లం. ఇంకా, రకరకాల పూల మొక్కలు పరిసరాలలో ఆహ్లాదకరంగానూ ఉంటాయి. 
ప్రత్యేకించి కార్తీకమాసంలో వన సమారాధనలు జరిపి, అక్కడే భోజనాలు చేసే సాంప్రదాయం పూర్వకాలం నుంచీ ఆచరణలో ఉంది. ఈ ఆధునిక కాలానికి ఇవి ఒక రకంగా ఆటవిడుపుగానూ, ఆహ్లాదకరంగా నూ మారాయి. ఏదైతేనేం, తోటలు, వనాలకు సూర్యోదయానికి ముందే చేరుకోవా లని పెద్దలు చెబుతారు. నీడనిచ్చే ఓ పెద్ద వృక్షం కింద దేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో అలంకరించి పూజలు జరపాలి. సామూహికంగా కలిసి, శాఖాహార వంటను వనదేవతలకు నైవేద్యంగా సమర్పించాలి.
ఆ తర్వాతే అందరూ పంక్తి భోజ నాలు చేయాలని చెప్తారు. పిల్లలకు చిన్న ఆటపాటలతో కాలక్షేపమూ జరుగుతుంది. దీనివల్ల పెద్దలు, బంధుమిత్రుల నడుమ ఆత్మీయతా అనుబంధాలు మరింతగా బలపడతాయని కూడా పెద్దలు చెప్తారు. అలా రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. 
నిజానికి తోటల్లోనే వండుకొని తినడం ఒక అరుదైన అనుభవం. పెద్దలు వంటలు చేస్తుంటే పిల్లలు చిన్నచిన్న పనుల్లో సాయం చేయడం ఉత్సాహంగా ఉంటుంది. కానీ, ఈరోజుల్లో చాలామంది క్యాటరింగ్ వారికి ఆర్డర్ చేస్తున్నారు. అలా వెళ్లడం, తినడం, ఇలా రావడం అన్నట్టు లాంఛనంగా మార్చక ఒక పవిత్ర కార్యంగా ఆచరించడం అన్ని విధాలా శ్రేయోదాయకం.