calender_icon.png 3 February, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాదేవీ నమోస్తుతే!

31-01-2025 12:00:00 AM

3న వసంత పంచమి

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా॥

యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా- 

అంటూ సకల విద్యాస్వరూపిణి అయిన సరస్వతిని స్తుతిస్తాం. ఆమె ఆవిర్భవించిన పరమ పావన తిథి ‘వసంత పంచమి’. బ్రహ్మవైవర్త పురాణం సహా అనేక పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని చెబుతున్నాయి. మాఘశుక్ల పంచమి రోజునే మనం ‘వసంత పంచమి’, ‘శ్రీ పంచమి’ లేదా ‘మదన పంచమి’గా జరుపుకుంటాం.

జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి, స్మరించి, పూజించే ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహాలక్ష్మికూడా ఆవిర్భవించినట్లు శాస్త్రాలు చెబుతున్నా యి. అందుకే, ఈ రోజును ఎలాంటి శుభకార్యాలకైనా దివ్యమైందిగా వేద పండితులు నిర్ధారించారు. ప్రత్యేకించి ముహూర్తాలు చూడవలసిన పని లేదనీ వారంటారు.

అసంఖ్యాకంగా అక్షరాభ్యాసాలు

గాయత్రీదేవి అయిదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. జ్ఞానానికి, సంగీతానికి, కళలకు అధి దేవత అయిన ఆమెను ఈ సందర్భంగా ఆరాధించడం ఆనవాయితీ. ముఖ్యంగా ‘వసంత పంచమి’ నాడు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యా సం చేయిస్తారు. సాధారణంగా పిల్లలకు అయిదేళ్ల ప్రాయంలో ఓనమాలు దిద్దించే కార్యక్రమా నికి శ్రీకారం చుడతారు.

ఈ పర్వదినం నాడు ఆలయాల పరిసరాలలో ఎక్కడ చూసినా పసుపురంగు దర్శనమిస్తుంది. అమ్మవారికి పసుపు చీరలు పెడతారు. పసుపురంగు మిఠాయిలు ప్రత్యేకంగా నైవేద్యం పెడతారు. ‘అక్షరాభ్యాసం’ అక్షరాలను సాధన చేయడం. దీన్ని ఈ పవిత్రమైన రోజు తొలిసారిగా పసిపిల్లలతో దిద్దించ టం ద్వారా విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టిస్తా రు. అక్షరం అంటే క్షరం (క్షీణత) లేనిది, అంటే నాశనం లేనిది అనర్థం.

అభ్యాసం అంటే సాధ న. భారతదేశంలోని కాశ్మీర్, కన్యాకుమారిలలో సుప్రసిద్ధ సరస్వతీ ఆలయాలున్నా, తెలంగాణకు చెందిన బాసరలోని చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ అమ్మవారు జగద్విఖ్యాతి చెందింది. అలా గే, హైదరాబాద్‌కు సమీపంలోని వర్గల్, సిద్దిపేట కరీంనగర్ మార్గంలోని అనంతసాగర్‌ల లోనూ శ్రీ సరస్వతీ అమ్మవారి క్షేత్రాలు అనేక ఏండ్లుగా భక్తులతో విశేష ఆదరణను పొందుతున్నాయి. 

సర్వశుభాలకు శారదామాత కరుణ

సాక్షాత్తు బ్రహ్మదేవుడు పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించినట్లు అంటారు. ఆమె ను ఆరాధించి పొందిన కృపాకటాక్షాలతోనే సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడని శాస్త్రా లు చెబుతున్నాయి. గాయత్రీదేవికి గల ఐదు రూ పాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గు రుశాపం వల్ల విద్యలను కోల్పోయాడు.

అప్పుడు ఆయన సూర్యుని ఆరాధించగా సరస్వతీ ఉపాసనను ఆదిత్యుడే ఉపదేశించాడు. సరస్వతీదేవి కృప వల్లే యాజ్ఞవల్క్యుడు కోల్పోయిన స్మృతి శక్తిని తిరిగి పొంది మహావిద్వాం సుడయ్యాడంటారు. వాల్మీకి మహర్షి సరస్వతీదేవిని ఉపాసించిన తర్వా తే శ్రీమద్రామాయణ రచనకు పూనుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

వేద వ్యాసుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లే వేద విభజన చేయగలిగాడంటారు. ఆమె కరుణా కటాక్షాలతోనే వ్యాస భగవానుడు పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మ సూత్రాది రచనలు చేశాడని, తద్వార భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూల పురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి.

తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన కూడా చదువులతల్లి అనుగ్రహం పొందాడు. జ్ఞానం మనిషిని బుద్ధిజీవిగా మారుస్తుంది. ఆ జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి ఆరాధన అందరికీ సర్వశుభదాయకమవుతుంది. పూర్వం రాజాస్థానాలలో ఈ పండుగ వేళ దర్బారులు నిర్వహించి, కవితా గోష్టులు జరిపి కవులను, పండితులను, కళాకారులను సత్కరించేవారు. 

 ముక్తావళి