calender_icon.png 20 October, 2024 | 5:26 AM

రైల్వేల్లో పచ్చదనం పరిశుభ్రత

20-10-2024 03:00:19 AM

  1. ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట 73,386 మొక్కల ప్లాంటేషన్
  2. 5191 కిలోమీటర్ల ట్రాక్ వెంట క్లీనింగ్
  3. శ్రమదానంలో పాల్గొన్న 36,183 మంది సిబ్బంది

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): స్వచ్ఛ భారత్ 10వ వార్షికోత్సవా న్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల మొదటి పక్షం రోజుల పా టు నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా (స్వచ్ఛతా పక్షోత్సవం) కార్యక్రమం విజయవంత మైంది.

ఇందులో రైల్వేశాఖ సైతం క్రియాశీలకంగా వ్యవహహరించింది. ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట 73,836 మొక్కలు నాటిన దక్షిణ మధ్య రైల్వే తన ప్రత్యేకతను చాటుకుంది. జోన్ పరిధిలోని 6 డివిజన్లు, వర్క్‌షాప్‌ల పాఠశాల్లోని విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వచ్చంధ సంస్థలు తదితరులతో పాటు రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది ఈ పక్షోత్సవాల్లో పాల్గొన్నారు. 

ట్రాక్‌ల పరిశుభ్రం

స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా జోన్‌వ్యాప్తంగా మొత్తం 5,196 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను శుభ్రం చేశారు. అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు సహా దాదాపు 36,183 మంది శ్రమదాన్‌లో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో చెత్త వేయకుండా 5,010 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. స్టేషన్లు, రైళ్లలో చెత్త వేసినందుకు 283 మందికి జరిమానా విధించి రూ. 56,600 వసూలు చేశారు.

జోన్‌వ్యాప్తంగా 1,522 కార్యాలయాల్లో స్వచ్ఛతను పాటించి 443 టన్నుల వ్యర్థాలను సేకరించారు. వివిధ రైల్వే ప్రాంగణాల నుంచి మొత్తం 27.44 టన్నుల ప్లాస్టిక్‌ను తొలగించి వర్క్‌షాప్‌ల నుంచి 430 టన్నుల స్క్రాప్‌ను సేకరించారు. జోన్ వ్యాప్తంగా, స్వచ్ఛతా ప్రతిజ్ఞలు, శ్రమదానాలు, మొక్కలను నాటే కార్యక్రమాలు, మారథాన్ వాకింగ్, స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు, వీధి నాటకాలు వంటి వివిధ కార్యక్రమాలు చేపట్టారు.

స్వచ్ఛత పక్వాడా ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు దక్షిణ మధ్య రైల్వే మొత్తం బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు. రైల్వే సిబ్బంది ఎల్లప్పుడు తమ ఇండ్లల్లో పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.