07-03-2025 12:00:00 AM
గీతం సిపోజియంలో ఐఐటీ హైదరాబాద్ రసాయన శాస్త్ర ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం
పటాన్ చెరు, మార్చి 6 : పచ్చదనంతోనే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట పడుతుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఐఐటీ హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం చల్లపల్లి సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘శక్తి, ఆరోగ్య సంరక్షణలో కొత్త సరిహద్దులు’ అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు సింపోజియంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.
ప్రపంచ ఉష్ణోగ్రత 2050 నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్, 2100 నాటికి 2-4 డిగ్రీల సెల్సియస్లు పెరుగుతాయనే అంచనా ఉందని, ఈ అసాధారణ వేడిమిని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ తమకు వీలయినంతగా చెట్లు నాటడం ఒక్కటే పరిష్కారమని అన్నారు. స్కాలర్ సైంటిఫిక్ సహ-సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం శక్తి, ఔషధ రంగాలలోని ప్రముఖులను ఆహ్వానించి, ఈ కీలక రంగాలలో తాజా పురోగతులు, సవాళ్లపై లోతైన అవగాహనతో కూడిన చర్చలకు వేదికగా నిలిచింది. స్థిరమైన ఇంధన వనరుల అత్యవసర అవసరాన్ని ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం చెబుతూ, గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాన్ని, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల ముఖ్యమైన సమస్యను ప్రముఖంగా ప్రస్తావించారు.