బదిలీ ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన టీజీటీఏ ప్రతినిధులు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి ఆప్షన్లు (ఐచ్ఛికాలు) ఇవ్వాలని ఆదేశిస్తూ సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను, డిప్యూటీ తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల తహసీల్దార్లతో జరిగిన సమావేశంలో తెలంగాణ తహసీల్దార్ల అసోసియే షన్ ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. టీజీటీఏ వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి..
బదిలీల కోసం ఆప్షన్లు ఇవ్వాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సీసీఎల్‌ఏ కమిషనర్‌కు, తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణకు టీజీటీఏ అధ్యక్షుడు ఎస్ రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, ప్రధాన కార్యదర్శి పాక రమేశ్, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.