calender_icon.png 1 March, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామునూర్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్

01-03-2025 01:00:47 AM

  1. అనుమతి మంజూరుచేసిన కేంద్ర ప్రభుత్వం
  2. పలుమార్లు కేంద్రంతో సీఎం రేవంత్ చర్చలు
  3. ఎట్టకేలకు ఎన్‌వోసీ ఇచ్చిన హెచ్‌ఏఐఎల్
  4. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారుల వెల్లడి

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్‌కుమార్ ఝా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైైర్మన్ విపిన్ కుమార్‌కు లేఖ ద్వారా తెలియజేశారు.

మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ర్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విమానా శ్రయ ప్రాధికార సంస్థ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణ యం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చర్చలు జరిపి ప్రాజెక్టును పట్టాలకు ఎక్కించడంలో చొరవ చూప డంతోనే అనుమతులు వచ్చాయని అధికారులు తెలిపారు.

పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌వోసీ అడ్డంకిని ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి క్లియర్ చేసింది. దీంతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (హెచ్‌ఏఐఎల్) తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటుచేసి మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కి.మీ. నిబంధనను సవరిస్తూ ఎన్‌వోసీ ఇచ్చారు.

ఇప్పుడు ఈ ఎన్‌వోసీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి సహకారంతో ఎయిర్‌పోర్టు నిర్మా ణం మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని అధికారులు వెల్లడించారు.  త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉందని చెప్పారు.

మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కావాల్సిన 253 ఎకరాల అదనపు భూమిని తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధికార సంస్థకు అప్పగించేందుకు ఇంతకుముందే రూ.205కోట్లను విడుదల చేసింది. 

కేంద్ర ప్రభుత్వం, హెచ్‌ఏఐఎల్ ఒప్పందం వల్లే ఆలస్యం..

హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించేటప్పుడు  కేంద్రంతో, హెచ్‌ఏఐఎల్ చేసుకున్న ఒప్పందం లోని క్లాజ్ 5.2 లో 25 సంవత్సరాల లోపల, 150 కి.మీ. పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవి లేదా కొత్తగా దేశీయ/అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదని కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ పరిధిలో రాష్ర్టంలో ఇప్పటివరకు మరో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరగలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు హెచ్‌ఏఐఎల్ తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అంగీకారం తెలిపింది. 

నిజాం కాలంలోనే ప్రముఖ విమానాశ్రయం!

జనగామ, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): మామునూరు ఎయిర్‌పోర్టుకు దశాబ్దాల చరిత్ర ఉంది. నిజాం కాలంలోనే ఈ ప్రాంతం ఎయిర్‌పోర్టుగా విలసిల్లింది. 1930లోనే మామునూరు ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయగా సౌత్ ఏషియాలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఇది పేరొందింది. దాదాపు వేయి ఎకరాల స్థలంలో 1930లో విమానాశ్రయం ఏర్పాటు చేయగా1981 వరకు కొనసాగింది. దాదాపు 51 సంవత్సరాలు ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు సాగాయి.

చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సైతం షోలాపూర్, కాగజ్‌నగర్‌వంటి ప్రాంతాలకు నిత్యం ఇక్కడి నుంచే వెళ్లేవారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే మంత్రులు, రాష్ట్రపతులు, ప్రధానులు సైతం ఇక్కడే ఫ్లుటై దిగేవారు. ఇండో-చైనా యుద్ధం సమయంలో టెర్రరిస్టులు ఢిల్లీ ఎయిర్‌పోర్టును టార్గెట్ చేయగా మన విమానాలను నిలిపేందుకు 1970లో ఇక్కడ పొడగాటి హ్యాంగర్‌ను నిర్మించారు.

1970-77 కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు కూడా నడిచాయి. ఇంతటి ఘనచరిత్ర కలిగిన మామునూరు విమానాశ్రయం 33 ఏళ్ల కిందట మూతపడింది. ఆ తర్వాత ఈ విమానాశ్రయాన్ని పునఃప్రారంభించాలని బీఆర్‌ఎస్ పోరాటం చేసింది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ అంశం మూలనపడింది.

తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మామునూరు ఎయిర్‌పోర్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కూడా వెచ్చించింది. ఎలాగైనా ఎయిర్‌పోర్టును ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్న వేళ కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో దీనిని నిర్మించాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేస్తే విమానాశ్రయాన్ని కేంద్రమే నిర్మించనుంది.

మోదీవల్లే ఎయిర్‌పోర్టు కల సాకారం

ఎక్స్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్

వరంగల్ వాసుల చిరకాల స్వప్నం ప్రధాని మోదీ వల్లే సాకారమైంది. ఈ నిర్ణయంపై తెలంగాణ వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఏ-320రకం విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ విమానాశ్రయ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణం వల్ల రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయి.

ప్రజల ఆకాంక్ష నెరవేరింది..

ఎక్స్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్

ప్రాంతీయ అనుసంధానానికి, తెలంగాణ అభివృద్ధికి మామునూరు (వరంగల్) ఎయిర్‌పోర్టు చిరునామాగా మారనుంది. వరంగల్ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతివ్వడం హర్షణీయం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ నిర్ణయం నిలువుటద్దంగా నిలుస్తుంది. త్వరితగతిన నిర్మాణపనులు పూర్తిచేసుకుని, ప్రజలకు మెరుగైన ప్రయాణసేవలు అందించాలని కోరుకుంటున్నా.